ఏపీలో దళితులు బతకడానికి ఆస్కారమే లేదా?

  • టీడీపీలో ఎందుకు చేరారో సమాధానం చెప్పాలి
  • వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున
విశాఖ: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దళితులు బతకడానికి ఆస్కారమే లేకుండా చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. దళితుల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. విశాఖలో శనివారం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగమని ఆశ చూపి ఓట్లు వేయించుకొని తానైతే సీఎం అయ్యాడు కానీ.. ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని ధ్వజమెత్తారు. మాయమాటలు,  అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దళితుల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరిట దళితుల భూములు బలవంతంగా లాక్కున్నారని, రెండున్నరేళ్ల టీడీపీ పాలనలో పేదలకు సెంటు స్థలం కూడా పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చట్టాలను తనకు చుట్టాలుగా మార్చుకున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు బడ్జెట్‌లో అరకొరగా కేటాయింపులు చేస్తున్నారని, ఇచ్చిన మొత్తం నిధులు కూడా దళితులకు ఖర్చు చేయడం లేదని ధ్వజమెత్తారు. పైగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఇతర పనులకు వినియోగించుకోవచ్చు అని బాబు జీవో తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. దళిత విద్యార్థులకు స్కాలర్‌షిపులు ఇవ్వడం లేదని, సంక్షేమ హాస్టళ్లను మూత వేస్తున్నారని, రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కుంటున్నారని ఫైర్‌ అయ్యారు. దళితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించాల్సిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం దురదృష్టకరమన్నారు. వారు టీడీపీలో ఎందుకు చేరుతున్నారో ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు.
 

తాజా వీడియోలు

Back to Top