26న జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన

  • ఐదుకోట్ల ఆంధ్రులకు బాబు వెన్నుపోటు
  • ప్రత్యేకహోదా కోసం వైయస్సార్సీపీ పోరాటం ఉధృతం
  • గణతంత్ర దినోత్సవం రోజున కొవ్వొత్తుల ప్రదర్శన
  • విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు
ఏపీకి ప్రత్యేకహోదాను కోరుతూ గణతంత్ర దినోత్సవం రోజైన ఈనెల 26న సాయంత్రం 6 గంటలకు 13 జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాలని వైయస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ ప్రదర్శనలో పాల్గొనటం ద్వారా ప్రజాస్వామికంగా, శాంతియుత పద్ధతిలో ప్రత్యేకహోదా డిమాండ్ కు మద్దతు పలకాల్సిందిగా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విద్యార్థులు, యువతకు ప్రత్యేకించి పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగాలని కాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు. ఈ ఉద్యమానికి సమాజంలోని అన్ని వర్గాల వారు మద్దతు పలకాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి ప్రత్యేకహోదాతోనే సాధ్యమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండున్నరేళ్లుగా అలుపెరగకుండా పోరాడుతోంది. ప్రజాపక్షంగా అటు పార్లమెంట్, ఇటు శాసనసభల్లోనూ..విభిన్న నిరసనల ద్వారా పోరాటం చేస్తోంది. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, యువభేరి సదస్సులు, చివరకు వైయస్ జగన్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఐనా కూడా ప్రభుత్వాల్లో చలనం లేదు. 

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయి.  హోదా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ బీజేపీ, టీడీపీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. ఏపీకి హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాయి. అధికారం చేపట్టాక ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా వంచించారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ఐదుకోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు.
Back to Top