ఎన్నికల్లో డబ్బు పంచనని చెప్పగలవా

– చంద్రబాబుకు సవాల్‌ విసిరిన వాసిరెడ్డి పద్మ 
– డిజిటల్‌ ఎన్నికలకు సిద్ధమా మీరు
– మూడేళ్లలో మీరు చేసిన పది మంచి పనులు చెప్పగలరా 
– మీ 5 సంతకాలపై బహిరంగ చర్చకు మేము ఎప్పుడో సిద్ధం
– విలేకరుల సమావేశంలో చంద్రబాబును తూర్పారపట్టిన వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః ఇటీవల విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రెండు లక్షలు కూడా లేనివారు ఎన్నికలయ్యాక కోట్లు సంపాదిస్తున్నారని చెప్పడం మీ గురించే అనుకోవచ్చా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని చెప్పడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సాక్షాత్తు మీ స్పీకర్‌ ఎన్నికల్లో 11 కోట్లు ఖర్చు పెట్టానని ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికి పోయిన సంగతి రికార్డెడ్‌ వీడియో అందరి వద్ద ఉందని చెప్పారు. 
 
డిజిటల్‌ ఎన్నికలు నిర్వహించే దమ్ముందా
డిజిటల్‌ మనీ గురించి మాట్లాడే చంద్రబాబుకు డిజిటల్‌ ఎన్నికలు నిర్వహించే దమ్ముందా అని ప్రశ్నించారు. 500, వెయ్యి నోట్లు పంచి గెలుస్తున్నారని పత్తిత్తులా మాట్లాడే చంద్రబాబు రానున్న ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పగలరా అని ప్రశ్నించారు. 2019 వరకు ఆగడం దేనికి మా పార్టీ నుంచి గెలిచిన 21 మందికి కండువాలు కప్పి చేర్చుకున్న చంద్రబాబు వారిచేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వచ్చే చావ ఉందా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు.. కోర్టుల్లో ఇరుక్కుపోయి స్టేలు తెచ్చుకుంటున్నారు.. అయినా నీతి సూత్రాలు వల్లించడం సిగ్గుచేటన్నారు. బాబు చేసిన అరాచకాలాన్నీ వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు మరిచిపోతున్నారని పగటి కలలు కంటున్నారని.. కానీ బాబు ఓడించే ఎన్నికల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. 

ఎన్నికల్లో డబ్బు పంచడం.. గెలిచాక ఎమ్మెల్యేలను కొనడం
చంద్రబాబు చరిత్రంతా ఎన్నికలకు ముందు డబ్బు పంచడం.. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను కొనడం అని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. మా అధినేత వైయస్‌ జగన్‌ను బహిరంగ చర్చకు రమ్మనేముందు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గొప్పగా చెప్పుకున్న 5 సంతకాల మీద మీరు చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. మీరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. మూడేళ్ల కాలంలో మీరు చేసిన పది మంచి పనులు చెప్పగలరా అని ప్రశ్నించారు. దేశంలోనే ఏపీలో కాస్ట్‌లీ ఎన్నికలుగా మార్చిన దౌర్భాగ్య ఘనత కూడా చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మనం పాటిస్తున్నామా.. మనకి ఆ అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడం మంచిదని హితవు పలికారు. 
Back to Top