బాబు అవినీతి పాలనను ఎండగడుదాం

మోడీ, కేసీఆర్ తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
దోచుకున్న సొమ్ముతో ప్రతిపక్షంపై కుట్ర రాజకీయాలు
హామీలు విస్మరించి అవినీతి పాలన సాగిస్తున్న బాబు
ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న పార్టీ వైయస్సార్సీపీ
వైయస్ జగన్ వ్యక్తిత్వంపై టీడీపీ దాడిని తిప్పికొట్టాలిః పార్టీ నేతలు

విజయవాడ: చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. విజయవాడలో జరుగుతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీ, హైదరాబాద్లో కేసీఆర్ను కాళ్లావేళ్లా పడి ప్రాధాయపడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి తెచ్చిన ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు అందినకాడికి దోచుకుంటూ.... ప్రతిపక్షం లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.

పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు వందలకోట్లు దోచుకున్నారని పెద్దిరెడ్డి ఫైరయ్యారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని అన్నారు. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు రూ.లక్షా 50వేల కోట్లు దోపిడీ చేశారన్నారు. చంద్రబాబు అవినీతిని అన్ని గ్రామాల్లో తెలియచేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ నిరాధార ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలన్నారు. అలాగే గడప గడపకు వైయస్ఆర్ కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని, అదే సమయంలో ఊరూరా సభ్యత్వ నమోదు చేయాలని పెద్దిరెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

ఎన్ని అటుపోటులు ఎదురైనా భ‌య‌ప‌డేదీ లేదు...
పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి
చంద్రబాబు ప్రతిపక్షంపై ఎన్ని కుట్రలు చేసినా.... ఏమాత్రం అదరకుండా, బెద‌ర‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డిన పార్టీ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని  పార్టీ నేత భూమన క‌రుణాక‌ర్ రెడ్డి అన్నారు. వైయస్ కుటుంబంపై టీడీపీ దుర్మార్గంగా దాడి చేస్తోందని..దాన్ని ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. విజయవాడలో విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఒక‌ప్పుడు కుళ్లిపోతున్న కాంగ్రెస్ పార్టీని త‌న పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి తీసుకొచ్చి బ‌ల‌ప‌ర్చిన మ‌హానేత.... వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని భూమన వివ‌రించారు. అలాంటి మ‌హానేతపై సైతం టీడీపీ మాట‌ల యుద్ధం చేసింద‌న్నారు. అయినా ప్ర‌జ‌లంద‌రు వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప‌థ‌కాలు, అభివృద్ధి ప‌నుల‌ను చూసి రెండుసార్లు ప‌ట్టం క‌ట్టిన విష‌యం గుర్తు చేశారు. ప్ర‌స్తుతం వైయ‌స్ జ‌గ‌న్‌పై సైతం అలాంటి మాటల యుద్ధం జ‌రుగుతుంద‌న్నారు. గెలుపుకు అతి స‌మీపంలోకి వెళ్లిన పార్టీ వైయస్సార్‌సీపీ అని చెప్పారు.  త‌ప్పుడు హామీల‌ను ఇవ్వ‌లేకనే అధికారంలోకి రాలేదు త‌ప్ప... ప్ర‌జ‌ల ఆశీస్సులు ఎల్లవేలలా వైయస్సార్సీపీకే  ఉన్నాయ‌న్నారు. 

600 హామీలు ఏమ‌య్యాయి బాబు...
ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఇచ్చిన ఆరు వంద‌ల హామీల‌లో ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని భూమన మండిప‌డ్డారు. అమ‌రావ‌తి పేరుతో జ‌రుగుతున్న అక్ర‌మ భూదందాకు మాత్ర‌మే వైయ‌స్సార్ సీపీ వ్య‌తిరేక‌మ‌ని, అమ‌రావ‌తి రాజ‌ధానికి వ్య‌తిరేకం కాద‌ని పేర్కొన్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఇచ్చిన రుణమాఫీ ఏమైంద‌ని ఆయ‌న బాబును ప్ర‌శ్నించారు. తాను అధికారంలోకి వ‌స్తే ఒక్క బెల్టు షాపు కూడా ఉండ‌ద‌న్న బాబు ఇప్పుడు ఊరురా బెల్టు షాపుల‌ను తెరుస్తున్నార‌ని ఫైరయ్యారు. అభివృద్ధి చేయ‌డానికి బాబు ముందుకు వ‌స్తే వైయస్సార్‌సీపీ ఎల్లవేలలా స‌హక‌రిస్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. 

ఉద్య‌మాలు... పోరాటాలు.. దీక్ష‌లే ఆయుధం...
వ‌చ్చే మూడేళ్ల‌లో జ‌రగ‌బోయే ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్‌సీపీ  ఉద్య‌మాలు, పోరాటాలు, దీక్ష‌లు, ధ‌ర్నాలే ఆయుధాలని ఆయ‌న పేర్కొన్నారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య సాధ‌న కోస‌మే వైయ‌స్సార్‌సీపీ ఉంది త‌ప్ప అధికారం కోసం కాద‌ని ఆయ‌న చెప్పారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన‌ా, క‌న్నీళ్ల బారిన ప‌డినా అన్ని ర‌కాలుగా వైయ‌స్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుంది త‌ప్ప వెనుదిరిగే ప్ర‌సక్తే లేద‌ని భూమన తెలియ‌జేశారు. వైయ‌స్సార్‌సీపీ నుంచి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు వెళ్లినంత మాత్ర‌మే పార్టీకి వ‌చ్చిన న‌ష్టామేమీ లేద‌ని, మ‌న ఆస్తి వైయస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందన్నారు. వైయస్ జగన్ వ్యక్తిత్వంపై టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలన్నారు.  భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రికి లేని వ్య‌క్తిత్వ వికాసం వైయస్ జగన్ సొంతమన్నారు.  డ‌బ్బుల‌కు అమ్ముడుపోయిన వ్య‌క్తులు సైతం వైయ‌స్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారంటే చంద్ర‌బాబు వారిని ఎంత‌ దిగ‌జార్చారో అర్థం అవుతుంద‌న్నారు. 
Back to Top