విమానాల ఖర్చును ప్రజలపై రుద్దుతున్నారు

ప్రజలకు పెనుభారంగా మారిన బాబు
ఛార్జీల, పన్నుల పేరుతో పేదలకు వాత
ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు
బాబు ఇకనైనా మాటలు కట్టిబెట్టు
ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించుః ఎమ్మెల్యేలు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న పాల‌న‌లో ఒక్క‌సారి కూడా విద్యుత్‌, ఆర్‌టీసీ బ‌స్ ఛార్జీలు పెంచిన దాఖాలాలు లేవ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లోనే రెండుసార్లు విద్యుత్ చార్జీలు, ఒక‌సారి ఆర్‌టీసీ బ‌స్ ఛార్జీలు పెంచార‌ని మండిపడ్డారు. డీజిల్‌పై 25శాతం వ్యాట్‌తోపాటు లీట‌ర్‌కు రూ. 4 , పెట్రోల్‌పై 33 శాతం వ్యాట్‌ తో పాటు లీట‌ర్‌కు రూ. 4 ప‌న్ను వ‌సూళ్లు చేస్తున్నార‌ని అన్నారు.  చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ, ఆ ఖ‌ర్చును... ధ‌ర‌ల పేరుతో ప్ర‌జ‌ల‌పై మోయ‌లేని భారాన్ని మోపుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. 

క‌రువు, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు సంబంధించి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో స‌మ‌స్య తీవ్ర‌త‌కు త‌గ్గ‌ట్టుగా చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానం కేవ‌లం కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాల‌కు మాత్ర‌మే తోడ్పడే విధంగా ఉండ‌డం  దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న మెట్రోరైల్‌, అమ‌రావ‌తి రాజ‌ధాని, అభివృద్ధి, ఆర్థిక న‌మూనాలు.. రాబోయే కాలంలో రాష్ట్ర‌ ప్ర‌జ‌లందరికీ గుదిబండ‌గా మార‌నుంద‌ని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి వివ‌రించారు. 

ఇప్ప‌టికే దాదాపు ల‌క్ష 90వేల కోట్ల రూపాయల అప్పుకు చేరుకోబోతున్న రాష్ట్రం ...ఇప్పుడు కీర్తికాంక్ష కోసం వెంప‌ర్లాడ‌డం అవ‌స‌రమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు.  రాయ‌ల‌సీమలో ఎలాంటి ఉపాధి అవ‌కాశాలు, ఉద్యోగాలు లేని దుస్థితి నెల‌కొంద‌ని, ఇలాంటి ప్రాంతాల్లో పరిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పి యువ‌త‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్రభుత్వంపై ఎంతైనా ఉంద‌న్నారు.  గోదావ‌రి జ‌లాలు, కృష్ణా నీటిని రాయ‌ల‌సీమ‌కు ఇస్తామ‌న్న రాష్ట్ర ప్ర‌భుత్వం అది నేర‌వేర్చి మాట నిరూపించుకోవాల‌న్నారు.

 చంద్ర‌బాబుకు అమ‌రావ‌తి త‌ప్ప మ‌రేది క‌న‌బ‌డ‌డం లేద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌న్న ధ్యాస లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని దుయ్యబట్టారు. అమ‌రావ‌తికి ప్ర‌త్యేక‌హోదా కావాలంటున్న చంద్ర‌బాబు ...వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక హోదా ఎందుకు అడ‌గ‌డం లేద‌ని నిలదీశారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మాట‌లు కట్టిబెట్టి చేతల్లో చూపించాలని హితవు పలికారు. 
Back to Top