ప్రజలు తరిమికొడితే దాక్కోవడానికే అక్కడ ఇళ్లు

  • నీదికాని రాష్ట్రంలో నువ్వెలా ఇళ్లు కట్టుకుంటావ్‌ చంద్రబాబు
  • వైయస్‌ జగన్‌ ఇంటిపై ఆరోపణలు రుజువు చేయాలని భూమన చాలెంజ్‌
  • మూడేళ్లల్లో పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా బాబు
  • ఏపీ ప్రజల పాలిట యముడిగా తయారైన సీఎం
  • చంద్రబాబు ఇంటి నిర్మాణంలోని లోగుట్టు ప్రజలకు చెప్పాలి
  • 8 ప్రాంతాల్లో పదుల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిన బాబు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు తిరిమికొడితే దాక్కోవడానికి చంద్రబాబు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకున్నారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న వేలమంది ఉద్యోగులను, అసెంబ్లీని బలవంతంగా అమరావతికి తరలించిన చంద్రబాబు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని భూమన నిలదీశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల వేళ నా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని ప్రతీ ప్రాంతంలో వాగివాగి అలసిపోయిన చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క పక్కా ఇల్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 5 సంవత్సరాల్లో 48 లక్షల ఇళ్లు పేద ప్రజలకు కట్టించారని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కొని హైదరాబాద్‌ నుంచి రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయిన చంద్రబాబు, తనది కాని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇల్లు నిర్మించుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సద్దాంహుస్సేన్ బంకర్లతో నిర్మించుకున్న విధంగా, షాజహాన్‌ చక్రవర్తి తాజ్‌మహాల్‌ను కట్టించుకున్న విధంగా బాబు తన ఇంటి నిర్మాణం చేపట్టారని దుయ్యబట్టారు. ఏ ఒక్కరికి ప్రవేశ అర్హత లేకుండా రహస్యంగా 25 వందల చదరపు గజాల్లో వందలాది మంది భద్రతా సిబ్బంది నడుమ ఇంటి నిర్మాణం జరిగిందన్నారు. 

రూ. 30–40 వేల మార్బుల్సా?
చంద్రబాబు ఇంటికి చదరపు అడుగుకు రూ. 30–40 వేల అత్యంత ఖరీదైన ఇటాలియన్‌ మార్బుల్స్‌ వాడారని తెలుగుదేశం పార్టీ నేతలే లీకులు ఇస్తున్నారని భూమన స్పష్టం చేశారు. వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి చంద్రబాబు విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో సుందరమైన రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆర్భాటంతో శంకుస్థాపన చేశారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క శాశ్వత ఇటుక కూడ పడలేదని భూమన విమర్శించారు. కానీ చంద్రబాబు మాత్రం సింగపూర్, జపాన్, దావూస్‌ తరహాలో తన ఇంటిని నిర్మించుకున్నారన్నారు. నేను బంగారు ఉంగరాలు, చైన్‌లు వేసుకోను నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతానని గొప్పలు మాత్రం బాగా చెబుతున్నాడన్నారు. అయ్యా మాంసం తినే వాళ్లంతా ఎముకలు మెడలో వేసుకోరు.. అలాగే కోట్ల అవినీతి చేస్తున్న వ్యక్తి కూడా తన అవినీతిని బయటకు ప్రదర్శించుకోడని బాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేంద్రం దగ్గర భ్రత్యుడిగా ఉంటూ ఇక్కడేమో యముడిగా తయారవుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు చంద్రబాబు వల్ల జరిగే మేలు ఏమీ లేదన్నారు.

హైదరాబాద్‌లో ఇల్లెందుకు కట్టుకున్నారు
చంద్రబాబు తన ఇంటిని ఎందుకు అంత రహస్యంగా నిర్మించి, ప్రారంభించారో చెప్పాలని ప్రశ్నిస్తే... ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌ ఎల్లో సాహిత్యం విడుదల చేసిందని భూమన మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ఇంట్లో 70 గదులు, 2 హెలిఫ్యాడ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, 2 సినిమా థియేటర్లు ఉన్నాయంటూ అవాస్తవాలు ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ ఇల్లు తెరిచిన పుస్తకం అని నిత్యం వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చిపోతుంటారన్నారు. కానీ చంద్రబాబు ఇంటికి మాత్రం ఎందుకంత రహస్యమని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ఇంటికి రూ. 300 కోట్ల విలువ అని చంద్రబాబు ఇంటికి మాత్రం విలువ లేదని చెబుతున్నారన్నారు. అంటే టీడీపీ నాలెడ్జ్‌ సెంటరే చంద్రబాబు ఇంటికి విలువ కట్టలేకపోతుందంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎల్లో సాహిత్యం చెప్పినట్లుగా వైయస్‌ జగన్‌ ఇంట్లో సినిమా థియేటర్లు, హెలిప్యాడ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, ఇంటి వెల అంత ఖరీదు ఉంటే దేనికైనా సిద్ధం అని చాలెంజ్‌ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు చాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం రహస్యంపై సమాధానం చెప్పాలని, అసలు హైదరాబాద్‌లో ఇల్లు ఎందుకు కట్టుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. 

దమ్ము, ధైర్యం ఉంటే విచారణకు సిద్ధపడు బాబు
తాను ఏది చేస్తే అదే నీతి, ప్రతిపక్షానిది మాత్రం అవినీతి అన్న పిలాసఫీలో చంద్రబాబు బతుకుతున్నాడని భూమన చురకంటించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని తన ఇంటిని భూతలస్వర్గంగా నిర్మించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టిన వెంటనే హైదరాబాద్‌లోని తన సెక్రటేరియట్‌ భవనానికి రూ. 7 కోట్లు, జూబ్లీహిల్స్‌లోని తన పాత ఇంటి రిపేర్లకు రూ. 2 కోట్లు, లేక్యూ గెస్ట్‌హౌస్‌కు రూ. 3 కోట్లు, జూబ్లీ హిల్స్‌ రెంటల్‌ హౌస్‌కు రూ. 2 కోట్లు, శేరిలింగంపల్లిలోని ఫాంహౌస్‌కు రూ. 4 కోట్లు, తరువాత పార్కు హయత్‌ హోటల్‌లోని రెండు సూట్లకు నెలకు రూ. 14 లక్షలు రెంట్‌ ఇప్పటికీ చెల్లిస్తున్నాడన్నారు. విజయవాడ లింగమనేని గెస్ట్‌ హౌస్‌కు రూ. 5 కోట్లు, విజయవాడ క్యాంపు ఆఫీస్‌కు రూ. 2 కోట్లు, సీఎం కొత్త సెక్రటేరియట్‌ ఆఫీస్‌కు రూ. 10 కోట్లు విడుదల చేశాడని భూమన లెక్కలతో సహా బాబు బండారాన్ని బయటపెట్టారు.  ఈ మూడు సంవత్సరాల కాలంలో పేదవాడికి ఒక్క ఇల్లు ఇవ్వలేని వ్యక్తి  8 ప్రాంతాల్లో పదుల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడని మండిపడ్డారు. నీ అవినీతి మీద, దోపిడి పాలన మీద, అరాచకం మీద ఇప్పటికైనా విచారణకు సిద్ధపడాలని భూమన చంద్రబాబుకు సూచించారు. ధైర్యం ఉంటే స్టేలు తెచ్చుకోకుండా న్యాయంగా విచారణను ఎదుర్కోవాలని డిమాండ్‌ చేశారు. 
Back to Top