ప్రతిపక్షనేత కాలిగోటికి కూడా బాబు సరిపోడు

  • వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం ముందు బాటు చిట్టెలుక
  • ఓటమి భయంతోనే జననేతపై టీడీపీ విషప్రచారం 
  • ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌
  • కాంగ్రెస్‌ అభ్యర్థికి చంద్రబాబు రూ.10కోట్ల సహకారం
  • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే డ్రైనేజీ మురుగునీటిలో వేసినట్లే
  • టీడీపీ, కాంగ్రెస్‌ ఇద్దరు దొంగలకు తగిన గుణపాఠం చెప్పాలి
  • బూత్‌లలో చొరబడి రిగ్గింగ్‌లు చేసేందుకు బాబు కుట్రలు
  • ప్రజలంతా అప్రమత్తంగా ఉండి టీడీపీని తరిమికొట్టాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి
నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్టెలుక అని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. వ్యక్తిత్వంలో వైయస్‌ జగన్‌ కాలిగోటికి కూడా చంద్రబాబు సరిపోడని ఆరోపించారు. నంద్యాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు తన కోటరీతో హింసలు చేస్తూ వాటిని వైయస్‌ జగన్‌పై రుద్ధి విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు, నీచ నికృష్ణ పాలనపై దండయాత్ర చేసి ఆ పాలనను కచ్చితంగా ఖతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజల గొంతు నుంచి వస్తుందన్నారు. ప్రజల గొంతులోని ధ్వని వైయస్‌ జగన్‌ వినిపించారన్నారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు చేసే చంద్రబాబు శాంతిపావురమట. ఏ రోజు హింసా కార్యక్రమాల జోలికి వెళ్లని వైయస్‌ జగన్‌ హంతకుడట. ఎవరు ఎలాంటి వారు ప్రజలకు తెలుసని భూమన అన్నారు. 

మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్‌ 
నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్‌ మళ్లీ ఒకటయ్యారని భూమన అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలబెట్టేందుకు సహకరించారని, రూ. 10 కోట్లు ఇచ్చి వైయస్‌ఆర్‌ సీపీపై విష ప్రచారం చేయిస్తున్నాడన్నారు. గతంలో చంద్రబాబు, సోనియాగాంధీ మిలాఖత్‌ అయ్యి వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టించి అన్యాయంగా 16 నెలలు జైల్లో నిర్భందించారన్నారు. అయినా ఏ మాత్రం జంకకుండా తిరుగుబాటు తత్వంతో అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం అనే సిద్ధాంతాలతో ప్రజల కోసం వీరోచితంగా పోరాడుతున్న యోధుడు వైయస్‌ జగన్‌ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే డ్రైనేజీ మురికి నీళ్లలో వేసినట్లేనని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌ ఇద్దరు దొంగలు ఎన్నికల్లో ఆడుతున్న నాటకాన్ని తరిమికొట్టేందుకు వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయాలన్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీపై పచ్చ పత్రికల విష ప్రచారం
వైయస్‌ఆర్‌ సీపీకి బీజేపీ మద్దతు ఇస్తుందని పచ్చ పత్రికలు, ఛానళ్లు మరో విష ప్రచారాలు చేస్తున్నాయని భూమన మండిపడ్డారు. కాకినాడలో బీజేపీతో ప్రచారం చేయించుకుంటున్న చంద్రబాబు నంద్యాలలో ముస్లిం ఓట్లు ఎక్కడ చేజారిపోతాయోనని బీజేపీ వారిని రానివ్వడం లేదన్నారు. టీడీపీ చేతిలో అధికారం, డబ్బు, మీడియా ఉందని ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.  పిడికెడు అన్నం తినే చంద్రబాబు బకాసురుడిలా అవినీతికి పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు. తన కొడుకును దేశంలోనే అత్యంత సంపన్నుడిని చేసేందుకు తన పాలనను ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు. మూడున్నరేళ్లుగా ఒక్క సామాజిక వర్గానికి కూడా మేలు చేసిన దాఖలాలు లేవన్నారు.

బాబుపై నంద్యాల కసితీర్చుకుంటుంది
23న జరగబోయే ఉప ఎన్నికల్లో చంద్రబాబుపై కసితీర్చుకునేందుకు ప్రజలంతా సన్నద్ధులుగా ఉన్నారని భూమన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందు మాకు మొదటి అవకాశం వచ్చిందని, నంద్యాల ప్రజలు బాబుకు గుణపాఠం చెప్పేందుకు ఆగ్రహంతో ఊగిపోతున్నారన్నారు. నంద్యాలలో ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు తన గుండాలు, హంతకముఠాతో హింసాయుత పద్ధతుల్లో పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసే విధంగా పరిస్థితులు కల్పిస్తున్నాడని భూమన ఆరోపించారు. అలా చేయకుండా ఉంటే ప్రజాస్వామ్యన్ని పరిరక్షించిన వ్యక్తిగా చంద్రబాబు ఉంటాడన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి దుర్మార్గపు, నయవంచక పాలనకు చరమగీతం పాడేందుకు నంద్యాల పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సిద్ధంగా కావాలన్నారు. 
Back to Top