'చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన.. ఏపీకి ప్రత్యేక హోదా కోసమా? లేక కేంద్ర మంత్రులతో హోదా రాదని చెప్పించడానికా? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి ఏం సంబంధమని సూటిగా ప్రశ్నించారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్లానింగ్ కమిషన్ ఆదేశించినా.. నీతిఆయోగ్ ఏర్పాటయ్యే దాకా ఎందుకు మౌనంగా ఉన్నారో? చెప్పాలన్నారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ లాగా చంద్రబాబు కూడా ప్యాకేజీ వద్దు హోదా కావాలని ఎందుకు అడగడం లేదని ధ్వజమెత్తారు. ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా అన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కు అప్పుడు నిబంధనలు తెలియవా? అని ఎమ్మెల్యే బుగ్గన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టీడీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నది వాస్తవం కాదా? అంటూ దుయ్యబట్టారు. ఈ నెల 29న ఏపీ బంద్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Back to Top