బుధవారం నుంచి మళ్ళీ షర్మిల పాదయాత్ర

రంగారెడ్డి : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ‌ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అసమర్థ, ప్రజాకంటక పరిపాలనకు, అధికార కాంగ్రెస్,‌ ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కు, కుట్రపూరిత రాజకీయాలకు నిరసనగా శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గడచిన డిసెంబర్ 14‌వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని బిఎన్ రెడ్డి నగ‌ర్‌లో జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల మోకాలికి గాయం కావడంతో.. మరుసటి రోజు తుర్కయాంజాల్ సమీపంలో పాదయాత్రకు ‌విరామం ప్రకటించారు.

వైద్యుల సలహా మేరకు శ్రీమతి షర్మిల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. గాయం నుంచి శ్రీమతి షర్మిల కోలుకోవడంతో బుధవారం మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. తుర్కయాంజాల్ నుంచి బుధవారం ఉదయం 9.30 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని పాదయాత్ర సమన్వయకర్తలు ‌కె.కె. మహేందర్‌రెడ్డి, తలశిల రఘురాం తెలిపారు. తుర్కయాంజాల్, రాగన్నగూడ, మన్నెగూడ క్రా‌స్‌రోడ్సు, బొంగ్లూరు, మంగల్‌పల్లి, శేరిగూడ మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగి సాయంత్రానికి ఇబ్రహీంపట్నం చేరుతుందని వారు వివరించారు. ఇబ్రహీంపట్నంలో జరిగే బహిరంగసభలో శ్రీమతి షర్మిల అభిమానులు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని మహేందర్‌రెడ్డి, రఘురాం తెలిపారు.
Back to Top