టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి

–నంద్యాలలో టీడీపీ అప్రజాస్వామిక గెలుపు
–ఎమ్మెల్సీ పయ్యావుల సోదరుల కనుసన్నల్లో జూద కేంద్రాలు
–జగనన్న వస్తున్నాడని ప్రతి ఒక్కరికి చెప్పండి
–నవరత్నాల ప్లీనరీ సభలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: మోసాలతో మూడున్నరేళ్లు పాలన పూర్తి చేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను బూత్‌ లెవెల్‌ కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్ళి వివరించాలని స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక గవిమఠం వైనుక వైపున వున్న శ్రీ వీరశైవ కళ్యాణ మండపంలో వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాల సభ నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా పార్టీ బూత్‌లెవెల్‌ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా ఈసభకు తరలివచ్చారు. వజ్రకరూర్‌ మండల కన్వీనర్‌ జయేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించిందన్నారు. కేవలం ఎన్నికలలో గట్టెక్కడం కోసమే చంద్రబాబు 600 హమీలు ఇచ్చారని ఇందులో ఒక్కటి నేరవేర్చలేక పోయారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల పై కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ కోట్లాది రూపాయలు గుమ్మరించి టీడీపీ గెలిచిందన్నారు. అధికార దుర్వినియోగంతో గెలిచిన నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు తన విజయంగా భావిస్తే అంతకన్నా దిగజారుడు తనం మరొకటి వుండదన్నారు. 2004 నుండి 2009 వరుకు 52 ఉప ఎన్నికలు జరిగాయని ఇందులో టీడీపీ అభ్యర్థి ఒక్క చోట కుడా గెలవలేదని, 46 చోట్ల ఆపార్టీ డిపాజిట్లు కుడా కోల్పోయిందన్నారు. అలాంటిది నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ బెదిరించి, ప్రలోభ పెట్టి గెలవడం గొప్ప విషయమం కాదన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది వుంటే కోట్లాది రూపాయలు పెట్టి కోనగోలు చేసిన 20 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు.

హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు అందించే చిత్తశుద్ది మీకుందా:
హంద్రీనీవా ఆయకట్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని లక్ష ఎకరాల ఆయకట్టు సాగునీరు అందాల్సి వుందని, అయితే చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి అయినా ఒక్క ఎకరాకు కుడా సాగునీరు ఇవ్వలేదన్నారు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నియోజకవర్గంలోని బెళుగుప్ప, ఉరవకొండ, పొట్టిపాడు వద్ద జలజాగరణలతో పాటు రాగులపాడు పంప్‌హోస్‌ ను కుడా ముట్టడించామన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో పేదల ఇంటి పట్టాల కోసం ఎన్నో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి పట్టాలు ఇచ్చి, ఇండ్లు మంజురు చేయడానికి మనస్సు రావడంలేదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. గతంలో తాము చేసిన పోరాటాలను బూత్‌ లెవెల్‌ కార్యకర్తలకు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ కేశవ్‌ సోదరుల అండదండలతో జూద కేంద్రాలు:
కూడేరు మండలం కొర్రకోడు డ్యాం వద్ద ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్పల అండదండలతో భారీ జూద కేంద్రం నడుస్తుందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. రోజు లక్షల్లో జూదం నిర్వహిస్తూ ఒక్కడే మద్యం కుడా వారికి ఏర్పాటు చేశారని తెలిపారు. ఈజూద కేంద్రాల వద్ద ఒక ఎస్‌ఐ కుడా కాపాల వుంటారని, ప్రతి రోజు జూదంలో వచ్చిన లాభంలో పయ్యావుల సోదరులకు మామూళ్లు ముట్టచెబుతున్నారని తెలిపారు. గతంలో తాడిపత్రికు చెందిన ఒక వ్యక్తి జూదంలో లక్షలు ఓడి తాను ఆత్మహత్య చేసుకోని, తన కుటుంబ సభ్యులను హత మార్చాడని గుర్తు చేశారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు జూదం, మద్యం మాఫియాను పెంచిపోషిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు యువనేత వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు అశోక్, తోజోనాథ్, మాన్యంప్రకాష్, కాకర్ల నాగేశ్వరావు, బసవరాజు, జడ్‌పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, నిర్మలమ్మ, ఎంపీపీ కొర్రవెంకటమ్మ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయసుశీలమ్మ, చేనేత విభాగం జిల్లా కమీటిసభ్యులు ఎంసీనాగభూషణం, చెంగలమహేశ్వర తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top