బొత్స వ్యాఖ్యలపై భూమన మండిపాటు

హైదరాబాద్, 03 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మహన్ రెడ్డి పైనా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిప్పికొట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టిన పథకాలను వైయస్ఆర్ కాంగ్రెస్ తన అజెండాలో చేర్చుకుందనీ, అవన్నీ కాంగ్రెస్ పథకాలేననీ బొత్స వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే నిజమైతే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఆ పథకాలను ఎందుకు పొందుపరచలేదని భూమన ప్రశ్నించారు.  ఒక్క పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మాన్యువల్ లో పెట్టలేదన్నారు. పేదల వెతలు తీర్చడానికి మహానేత చేసిన ఆలోచనలే ఈ పథకాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. అలాంటి రాజశేఖరరెడ్డిగారి పేరును శాశ్వతంగా చెరిపివేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పథకాలను మార్చివేయడమో... వాటి ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేయడమో వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 982 వ్యాధుల నివారణకు మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని నీరుగార్చలేదా అని అడిగారు. జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తికాకుండా సమాధి కట్టలేదా.. ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని నీరుగార్చలేదా.. 108,104 సర్వీసుల సేవలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయలేదా.. అంటూ కాంగ్రెస్ పార్టీపై భూమన ప్రశ్నల వర్షం కురిపించారు.

 దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పథకాలకు తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ నేతలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కెక్కడుందని నిలదీశారు. ఏనాడైనా బొత్స తన పార్టీ పేరును పూర్తిగా ఉచ్చరించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తొలి అధ్యక్షుడి పేరును బొత్స చెప్పగలరా అని అడిగారు. ఆయన రాజకీయ పరిజ్ఞానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని భూమన పేర్కొన్నారు.

పేదల కోసం వైయస్ చేపట్టిన పథకాలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకే తమ పార్టీ జెండాలోనూ, ఎజెండాలోనూ వాటిని చేర్చామని ఆయన వివరించారు. పార్టీ పేరేమిటో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం తెలుపుతూ.. ‘‘మాది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. లక్షలాది మంది శ్రామికులు, కోట్లాది మంది రైతులు, మరెంతో మంది యువజనుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఆ వర్గాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించే సమున్నతమైన పార్టీ అని మేం ధైర్యంగా చెప్పుకోగలం. ఏ పార్టీనైనా సంక్షిప్త నామంతో పిలుస్తారు, అలాగే వై.యస్.ఆర్. కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నాం.. అందులోనే వైయస్సార్ పేరు కూడా ఇమిడి ఉంది...’’ అని ఆయన పేర్కొన్నారు.



తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్‌లపై టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు కారాగారాల నిబంధనల పుస్తకాన్ని ఓసారి చదువుకుంటే మంచిదని సూచించారు. టీడీపీ రాద్ధాంతం కారణంగానే వాస్తవంగా ఉండాల్సిన ములాఖత్‌లు శ్రీ జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వారానికి రెండుసార్లు, పర్యాయానికి నలుగురు చొప్పున ఏడాది కాలంలో ఎంతమంది శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని ఉంటారో లెక్క వేసుకుంటే తెలుస్తుందన్నారు. ములాఖత్ అంశంపై టీడీపీ నానా యాగీ చేసిందన్నారు.  

వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సయోధ్యకు మంతనాలు జరుగుతున్నాయని కృష్ణా పత్రిక ప్రచురించిన వార్తా కథనం వెనుక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమది నికార్సయిన, నిక్కచ్చి అయిన లౌకిక పార్టీ అని, అందువల్ల ఇలాంటి పత్రికలు రాసే గాలి, నీలి వార్తలను పట్టించుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందంటూ బొత్స చెప్పడం అసమంజసంగా ఉందని భూమన అన్నారు. ఏ తప్పూ చేయని, ఏనాడూ సచివాలయం వైపు కన్నెత్తికూడా చూడని జగన్‌పై అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించారని, సీబీఐ పెట్టిన ఈ తప్పుడు కేసులపైనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని భూమన వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానవర్గాన్ని జగన్ ధిక్కరించారన్న దుగ్దతోనే సీబీఐని ఉసిగొల్పి వేధిస్తున్నారని, నూటికి నూరు శాతం ఆయన నిష్కల్మషంగా బయటకు వస్తారని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన తమ పార్టీపైనా, జగన్‌పైనా తెల్లారి లేచిన దగ్గరి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.  


Back to Top