సింగపూర్ లోగుట్టు బయటపెట్టు

రాజధాని ముసుగులో నిలువు దోపిడీ
పేదలను కొట్టి సింగపూర్ కు ధారాదత్తం
విచ్చలవిడిగా ప్రజాధనం కొల్లగొడుతున్నారు
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయొద్దని...
ప్రభుత్వానికి బొత్స హెచ్చరిక

హైదరాబాద్:
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై నిప్పులు
చెరిగారు. రాజధాని ముసుగులో చంద్రబాబు ఆయన తాబేదారులు లక్షల కోట్ల
ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో
రాష్ట్రంలో రాజకీయ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల
నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్ లోని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం
చేయడం వాస్తవం కాదా అని బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న దోపిడీకి
వ్యతిరేకమని ముందు నుంచి చెబుతున్నామన్నారు బొత్స. తెలుగుదేశం సర్కార్
రాష్ట్రాన్ని దోచుకుంటున్న విధానాన్ని ప్రజలంతా గుర్తించాలని బొత్స
అన్నారు. సింగపూర్ తో చీకటి ఒప్పందాలను బయటపెట్టాలని చంద్రబాబును డిమాండ్
చేశారు. 

పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన
విలేకరులతో సమావేశంలో బొత్స మాట్లాడుతూ...తాత్కాలిక రాజధాని పేరుతో టీడీపీ
ప్రభుత్వం విచ్చలవిడిగా  ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు.
సింగపూర్ తో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయని
తెలిపారు.  ప్రజాధనం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రజలంతా తెలుసుకోవాలని
కోరారు. చంద్రబాబు సర్కారుతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్ ప్రతినిధులు
ఇప్పుడు రాజీనామా చేసి ప్రైవేటు కంపెనీలకు సీఈవోలుగా వెళ్తున్నారని బొత్స
తెలిపారు. ధనదాహంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దని చంద్రబాబుకు
హితవు పలికారు.

నారా లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా
వ్యవహరిస్తున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు ఓఎస్డీ సీతేపల్లి అభీష్ట
రాజీనామాతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రవర్తన మార్చుకోవాలని ముందు
లోకేశ్ కు చెప్పాలని చంద్రబాబుకు సూచించారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలని
డిమాండ్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో నిందితులను ఇప్పటివరకు ఎందుకు
అరెస్ట్ చేయలేదని, నిజాయితీ గల పోలీసు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని
బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

సింగపూర్
పేరు చెప్పుకొని అక్కడి వారితో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం
చేస్తున్నారని బొత్స విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను
ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజాపోరాటాలు చేస్తోందని
స్పష్టం చేశారు. జుగుప్సాకరంగా మహిళల మాన ప్రాణాలు దోచుకున్న  సెక్స్
రాకెట్ నిందితులను ఎందుకు శిక్షించడం లేదని, ప్రజలకు ఏం సమాధానం చెబుతారని
బొత్స ప్రభుత్వంపై శివాలెత్తారు.  రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం గానీ
ఇంత నీచ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ
నేతలు నీచ కార్యక్రమాలు చేసినా చంద్రబాబు వారిని వెనకేసుకురావడం
సిగ్గుచేటన్నారు. దోషులు ఎంతటివారైనా శిక్షించాలని, మాటలు చెప్పడం కాదని
చేతల్లో చూపాలని బొత్స చంద్రబాబును హెచ్చరించారు.
Back to Top