పంచభూతాల్ని దోచేస్తున్నారు

ఇసుక అమ్మకాల్లో విచ్చలవిడి దోపిడీ
వరద బాధితులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం
ప్రతిపక్షనేతల అక్రమ అరెస్ట్ లు
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..?

హైదరాబాద్ః
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను ప్రస్తావించిన ప్రతిపక్ష నేతలను అరెస్ట్
చేస్తారా..? రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రభుత్వాన్ని
ప్రశ్నించారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన
బొత్స... విశాఖలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్ ను తీవ్రంగా
ఖండించారు. ఇసుక అమ్మకాలలో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల దోపిడీకి పాల్పడిందని
బొత్స విరుచుకుపడ్డారు. ఇసుక అమ్మకాలతో రూ.3 వేల కోట్లు ఆదాయం వస్తుందని
చెప్పిన చంద్రబాబు ...ఇప్పుడు కేవలం రూ.850 కోట్ల లాభం మాత్రమే వచ్చిందని
చెప్పడంలో ఆంతర్యేమంటన్నారు. 

టీడీపీ నేతలు
పంచభూతాల్ని దోచుకుంటూ రాజ్యమేలుతున్నారని బొత్స విమర్శించారు. జనచైతన్య
యాత్రల పేరుతో దెందులూరుకు వెళ్తున్న చంద్రబాబు  ప్రజలకు ఏం సమాధానం
చెబుతారని నిలదీశారు. ఇసుకను దోచుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని
దుర్భషలాడామని చెబుతారా, లేక తమ సమస్యలు తీర్చాలని కోరిన అంగన్ వాడీలను
దూషించామని చెబుతారా, లేక ఇసుక దందాకు అడ్డొస్తుందని మహిళా అధికారిణి
వనజాక్షిని కొట్టామని చెబుతారా...ఏం సమాధానం చెబుతారని బొత్స చంద్రబాబును
సూటిగా ప్రశ్నించారు. సభ్యసమాజం సిగ్గుపడేట్లుగా ప్రవర్తించిన చంద్రబాబు,
ఆయన తాబేదారులు అక్కడి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

కరువు,
తుఫాన్ లతో ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోరు. అధికారుల మీద దాడులు జరిగి
వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నా పట్టించుకోరు. ఎంతసేపు దోపిడీ గురించే ఇంకో
ఆలోచనే లేదా చంద్రబాబు అని బొత్స మండిపడ్డారు. అబద్ధాలతో కాలం గడుపుతూ,
మోసపూరిత కార్యక్రమాల్ని శ్వేతపత్రాల పేరుతో విడుదల చేస్తూ చంద్రబాబు
ప్రజలను మభ్యపెడుతున్నారని బొత్స ఫైరయ్యారు. ఇకనైనా దోపిడీని ఆపి ప్రజలను
ఆదుకునే కార్యక్రమాలు చేయాలని హితబోధ చేశారు. మాటలు మాని పనులు
చేయాలన్నారు. లేనిపక్షంలో ప్రజాకోర్టులో ప్రభుత్వ అవినీతి, అరాచకాలను
నిలదీస్తామన్నారు. 

వరద బాధితులను ఆదుకోవడంలోనూ
ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గొప్పలు
చెప్పుకునేందుకు జనచైతన్య యాత్రలు చేస్తున్న చంద్రబాబు...వరద
ప్రాంతాల్లోని ప్రజల బాధలు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలతో ప్రజలు ఆర్తనాదాలు
పెడుతున్నారని, సహాయక చర్యలు అందడం లేదని ఆందోళన చెందుతున్నారన్నారు.
తక్షణమే ఏపీతో పాటు, తమిళనాడులోని తెలుగువారిని ఆదుకోవాలని ఆదుకోవాలని
డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల
జరిగిన నష్టం గురించి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
ఇప్పటికే ప్రజలందరితో చర్చించారని బొత్స తెలిపారు. తమిళనాడులో వర్షబీభత్సం
గురించి అక్కడ ఉన్న ఏపీకి సంబంధించిన పెద్దలతోనూ చర్చించినట్లు చెప్పారు.
భారీ వర్షాలతో అటు గోదావరి జిల్లాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లిందని బొత్స
ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి అయి ఉండి చంద్రబాబు కనీసం
అక్కడికి  వెళ్లకపోవడం, పంటలను పరిశీలించకపోవడం ఆక్షేపణీయమన్నారు. తడిసిన
ధాన్యాన్ని కొనుగోలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 
Back to Top