బీజేపీతో వైయ‌స్ఆర్‌ సీపీకి సంబంధాలున్నాయని దుష్ప్రచారం



హైదరాబాద్‌ :  బీజేపీతో వైయ‌స్ఆర్‌ సీపీకి సంబంధాలున్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంద‌ని, అలాంటివి ఏమీ లేవ‌ని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యలయంలో ఆయన రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపి విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఏపీకి నష్టం కలింగిచాయన్నారు. ఇప్పుడేమో బీజేపీతో వైయ‌స్ఆర్‌సీపీ క‌లిసిపోయింద‌ని అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  కేంద్రం మెడలు వంచి రాష్ట్రాభివృద్ధికి కృషి చేసేది వైయ‌స్ఆర్‌ సీపీనేనని తెలిపారు.

టీడీపీలా ట్యాంపరింగ్‌ చేసుకునే సంస్కృతి మాది కాదు
సీఎం చంద్రబాబు నాయుడు దోపిడీని పుస్తక రూపంలో తెచ్చి, దేశంలో అన్ని పార్టీల నేతలకు అందజేస్తామన్నారు. టీడీపీలా ట్యాంపరింగ్‌ చేసుకునే సంస్కృతి తమకు లేదని, బహిరంగంగానే ప్రజల ముందుకు వస్తామని, అన్ని విషయాలు చెబుతామన్నారు. టీడీపీ నేతలు రాంమాధవ్‌ ఇంటికి వెళ్లింది నిజమా..? కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి బుగ్గన రాజేంద్రప్రసాధ్‌ వెళితే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ సీఎం పక్కనే ఉంటారని, మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య టీటీడీలో మెంబర్‌గా అవకాశమిస్తారని, ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుస్తోందన్నారు. లాలూచీ రాజకీయాలు చేస్తూ తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అధికారం ఇచ్చింది ఐదేళ్లు దోపిడీ చేయడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాకచక్యంగా మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.  

శ్వేతప్రతం విడుదల చేయాలి..
1763 అలాట్మెంట్స్ కోసం 13 వేల 360 ఎకరాలు ఇస్తే 83 మాత్రమే ఇంప్లిమెంట్ వర్క్స్ నడుస్తున్నాయని, దీనికి మీరు పెట్టే బస్సుల్లో వెళ్లి చూడాలా అని ఎద్దేవా చేశారు. దమ్ము, చిత్తశుద్ది ఉంటే వచ్చిన కంపెనీల అలాట్మెంట్లపై శ్వేతపత్రం విడుదలచేయాలని సవాల్‌ విసిరారు. వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్లు ఇస్తే ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. ప్యాకేజీ వచ్చేస్తుందని, రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పారని, మళ్లీ ఇప్పుడు హోదా అంటూ యూ టర్న్‌ తీసుకుని సభలు పెడుతున్నారని మండిపడ్డారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. గుమ్మడి కాయ దొంగ అంటే బాబు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన చంద్రబాబు తనకు రక్షణ కావాలని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ చంద్రబాబు అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయారన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దోచుకుని చంద్రబాబు పారిపోదామనుకుంటున్నారని, రాష్ట్రంలో సమస్య వస్తే స్పందించే అధికారి ఎక్కడా లేరని, మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు.

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో అమర్‌ సింగ్‌ను చంద్రబాబు కలిసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ రామారావును ఎందుకు కలిశారో చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధన కోసం  వైయ‌స్ఆర్‌సీపీ  పుట్టిందన్నారు. చంద్రబాబు పరిపాలన గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ప్రజలంతా ఎప్పుడు టీడీపీకి బద్దిచెప్పాలా అని ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.




Back to Top