అధికారముందని దోపిడీకి పాల్పడితే సహించం

  • మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు
  • వారి కష్టాలు కనిపించడం లేదా బాబు..?
  • మంత్రులు, వ్యాపారులు కుమ్మక్కై రైతును ముంచుతున్నారు
  • కమీషన్లు, కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
  • కేంద్రంలో భాగస్వామిగా ఉండి మీరు రాష్ట్రానికి ఒరగబెట్టిందేమిటి
  • హోదా అడగకుండా నోటికి ప్లాస్టర్ వేసుకోవడం సిగ్గుచేటు..?
  • టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తిన బొత్స సత్యనారాయణ
హైదరాబాద్ః గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాల్లో మిరప రైతుల మనుగడ కష్టతరంగా ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. నాలుగు నెలలుగా రైతులు, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు అంతా మద్దతు ధర కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ శాఖా మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయి కూడ శ్రద్ధ కొరవడిందన్నారు.  రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మిర్చియార్డుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాక మంత్రి పుల్లారావు యార్డుకు వచ్చారన్నారు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి పంటను కొనుగోలు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆర్భాటంగా ప్రకటన చేయడం తప్ప నాలుగు నెలలవుతున్నా చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  ఐదు కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టడంతో పాటు  పంటలు పండించిన రైతుకు ఇబ్బందిలేకుండా చేస్తామని బాబు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని బొత్స గుర్తు చేశారు. కానీ, నేడు ఆ ఆలోచన ఎక్కడా కనిపించడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు బంధు పథకం కింద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని చెప్పారు. కానీ, నేడు బాబు ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. .

క్వింటాలు రూ. 1500 రైతులకు ఇస్తామని బాబు తనకు సంబంధించిన పత్రికల్లో లీకులు ఇస్తున్నారు. రైతుకు అందితే సంతోషమే గానీ ఇంకో దోపిడీకి తెరతీయొద్దని బొత్స హెచ్చరించారు. మంత్రులు, వ్యాపారస్తులు దళారులుగా మారి రైతులను దోచుకుంటున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయాన్నే నమ్ముకొని దానిపై వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతులకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు . అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందని దోపిడీకి తెరతీస్తే ఊరుకునేది లేదని బాబు సర్కార్ ను హెచ్చరించారు.  ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. మీరు కేంద్రంతో భాగస్వామిగా ఉండడం వల్ల రైతాంగానికి ఒరిగిందేమిటని బొత్స  బాబును కడిగిపారేశారు. ప్రభుత్వం తన సొంతానికి, స్వార్థానికి  కాంట్రాక్టులు, కమీషన్లు, కేసుల కోసం తప్ప  రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడేలా  ఏ కార్యక్రమం చేయడం లేదన్నారు. మూడేళ్ల బాబు పరిపాలనలో కేంద్రం నుంచి రాష్ట్ర రైతాంగానికి జరిగిన మేలు శూన్యమని అన్నారు. 

ప్రత్యేకహోదాపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు టీడీపీ ఎంపీల గైర్హాజరీ అవ్వడం,  ఉన్నవాళ్లు నోటికి ప్లాస్టర్ లు వేసుకోవడం పట్ల బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోదా గురించి మాట్లాడితే తమ స్కాం లు బయటకొస్తాయనే టీడీపీ ఎంపీలు తప్పించుకున్నారని ఎధ్దేవా చేశారు. ఏపీకి  హోదా ఇవ్వడం లేదు, అదనంగా నిధులిస్తున్నామని మంత్రి చెప్పినప్పుడు ....ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టం హామీలైన దుగ్గరాజపట్నం, రైల్వే జోన్, కోస్టల్ కారిడార్ లాంటి వాగ్దానాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత టీడీపీ ఎంపీలకు లేదా అని బొత్స ప్రశ్నించారు. పక్కనున్న తెలంగాణ ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు హోదా ఇవ్వాలని అడుగుతుంటే...వారిని చూసైనా మీ మనసు కరగలేదా...?మీకు ఆలోచన లేదా..?. మీ బుద్ధి ఏమైందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాలు, సమస్యలు తమకు అక్కర్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం పోలవరం కట్టే బాధ్యత కేంద్రానిదైనా .... కాంట్రాక్టులు, కమీషన్ల కోసం బాబు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి పోలవరం తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా అంచనాలు పెంచుకుంటూ పోతూ దోచుకుతింటూ వాస్తవాలను మరుగున పరుస్తున్నారని ఫైర్ అయ్యారు. 
Back to Top