హోదాపై పట్టుదలతో ఉన్నారు..!

గుంటూరుః గుంటూరు నల్లపాడురోడ్డులోని దీక్షా స్థలివద్ద వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత, వైెస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ నేతలు ఆందోళన  వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను అభినందిస్తూ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు తీర్మానం చేశారు. ఈసందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. ఐనా ప్రత్యేకహోదాను సాధించేందుకు జగన్ పట్టుదలతో ఉన్నారని స్పష్టం చేశారు.  హోదా తీసుకురావడమే తమ ధ్యేయమని బొత్స తేల్చిచెప్పారు. 

ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని బొత్స అన్నారు. వైఎస్ జగన్ దీక్షకు అశేషప్రజానీకం మద్దతు తెలుపుతుందని , ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేకహోదాయే సంజీవని అని పేర్కొన్నారు. 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

చంద్రబాబులా మోసం చేసే మాటలు జగన్ కు తెలియవని బొత్స సత్యనారాయణ అన్నారు. అలీబాబా నలభై దొంగల్లా టీడీపీ పంచభూతాలను దోచుకుంటుందని విమర్శించారు. టీడీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పోలవరంపై బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. బాబు భాగస్వామా కాదా అని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకే చంద్రబాబు రాజధాని భూములు తాకట్టు పెట్టారని బొత్స మండిపడ్డారు.  
Back to Top