మోదీని ప్ర‌స‌న్నం చేసుకునేందుకే బాబు భేటీ

గుంటూరు: రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టుపెట్టి కేవలం వ్యక్తిగత లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోనున్నారని వైయ‌స్ఆర్‌సీపీ  నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు ఏమి సాధించారని బొత్స ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు.. చంద్రబాబు పై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణకు రాకుండా మోదీని ప్రసన్నం చేసుకొనేందుకు చంద్రబాబు భేటీ కాబోతున్నారని అభిప్రాయపడ్డారు.
 
గుంటూరులో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో పరిపాలన ఆశ్చర్యకరంగా ఉంది. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పది లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసి మరీ జన్మభూమిని నిర్వహిస్తున్న విషయం నిజం కాదా?. వైఎస్‌ఆర్‌ హయాంలో ఇల్లు లేని లక్షలమందికి ఇళ్లు కట్టించి ఇచ్చాం. గుడిసె లేని రాష్ట్రం కోసం ఎంతగానో శ్రమించాం. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క ఇళ్లయినా కట్టించి ఇచ్చారా’ అని చంద్రబాబు పాలనపై మండిపడ్డారు. 

కల్తీకి కేంద్రంగా గుంటూరు తయారు అయ్యిందని, ఆ కల్తీలో ఏపీ మంత్రులు, అధికారులకు ప్రమేయం  ఉందని బొత్స ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అక్రమాలకు పాల్పడుతున్నారని, కిడ్నీ రాకెట్ కు కూడా గుంటూరు కేంద్రంగా మారిందన్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దల అండదండలతో కిడ్నీ రాకెట్ నడస్తుండటం కన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. కిడ్నీ రాకెట్ పై సమగ్రమైన విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వానికి ఆఖరి రోజులు వచ్చాయని, మంత్రులు, నేతల అవినీతే అందుకు నిదర్శనంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మార్చి మొదటివారంలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి కొనసాగిస్తోన్న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించనుందని వివరించారు.

ఆత్మవంచన చేసుకొని టీడీపీ పాలన
రాష్ట్రంలో అవినీతిని చట్టపరమైన కార్యక్రమంగా చేశారని ఎమ్మెల్సీ  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  విమర్శించారు. జన్మభూమి వినతులు కట్టలు కట్టి పక్కన పారేస్తున్నారని చెప్పారు. కల్తీతో రైతులు పూర్తిగా నష్టపోయినా.. చంద్రబాబు సర్కార్‌ తమ వైఖరి ఏంటో చెప్పటం లేదన్నారు. గత మూడేళ్ల కాలంలో రైతాంగం ఆదాయం 8.5శాతం తగ్గిందని గుర్తుచేశారు. ఇంకా రైతులను మోసగించి, తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ సర్కార్‌ ఆత్మవంచన చేసుకొని పాలన సాగించవద్దని ఉమ్మారెడ్డి హితవు పలికారు.


 

 

తాజా వీడియోలు

Back to Top