విశాఖ భూదందాపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధ‌మా?

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పు అయితే విశాఖ భూదందాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స‌వాల్ చేశారు. జిల్లాలో  టీడీపీ నేత‌లు చేస్తున్న‌ భూదందాపై సీబీఐ విచారణ వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గురువారం పాయకరావుపేట నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లు ముఖ్యఅతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో వందల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భూదందా వెనుక చంద్రబాబు, లోకేష్‌ల హస్తం కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు మంటగలుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రజాధనంతో జల్సాలు చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేని చంద్రబాబు మహానాడు వేదికగా అన్ని నెరవేర్చానని అబద్ధాలు ఆడుతున్నాడన్నారు. టీడీపీ సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటాలు చేయాలన్నారు. జిల్లాలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని పటిష్ట పరిచే దిశగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. 

వైయస్‌ఆర్‌ సీపీలోకి భారీ చేరికలు
కాంగ్రెస్‌ పార్టీ నేత దగ్గుపల్లి సాయిబాబు తన అనుచరులతో కలిసి పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌ల సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటుగా పాయకరావుపేటకు చెందిన 100 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా బొత్స, అమర్‌లు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు కొయ్య ప్రసాద్‌రెడ్డి, గొల్లబాబురావు, వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, వంశీకృష్ణ, కరణం ధర్మశ్రీ, రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డి, సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు.
Back to Top