నాయుళ్లిద్ద‌రూ వెన్నుపోటు బ్ర‌ద‌ర్స్

-ప్రత్యేకహోదా విషయంలో ఇద్దరు నాయుళ్లు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు
-తెలుగు ప్రజలకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారు..?
-ఉన్న పరిశ్రమలు కాపాడలేని సీఎం..కొత్తవి ఎలా తెస్తారు..?
-టీడీపీ, బీజేపీలపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గిరి ఎమ్మెల్యే రోజా ఫైర్


తిరుపతి:  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఆక్సిజ‌న్ లాంటిద‌ని అందుకోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మొద‌టి నుంచి పోరాడుతున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ న‌గిరి ఎమ్మెల్యే రోజా అన్నారు. బీజేపీ, టీడీపీ ప్ర‌భుత్వాల తీరు ఏరు దాట‌క ముందు ఏటి మ‌ల్ల‌న్న‌.... ఏరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న అన్న చందంగా ఉంద‌న్నారు. తిరుప‌తిలో న‌రేంద్ర‌మోడీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీనిచ్చి, తీరా అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెప్ప‌డం ఎంత దుర‌దృష్ట‌క‌ర‌మో ప్ర‌జ‌లే ఆలోచించాల‌న్నారు. తిరుపతిలో చైతన్యపథం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. కొద్దిగైనా మార్పు జరిగిందా..జరిగితే చర్చకు సిద్ధపడాలని ఇరు పార్టీలకు రోజా సవాల్ విసిరారు. 

అప్పుడు నిబంధ‌న‌లు గుర్తుకు రాలేదా..?
ప్ర‌త్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం వ‌ద్దంటుంద‌ని చెబుతున్న వారు... రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌న్న‌ప్పుడు నిబంధ‌న‌లు ఏమ‌య్యాయ‌ని రోజా నిల‌దీశారు. రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా ఐదేళ్లు కాదు... ప‌దేళ్లు కావాల‌ని వెంక‌య్య నాయుడు అడిగిన‌ప్పుడు  నిబంధ‌న‌లు గుర్తుకు రాలేదా అన్నారు. తిరుప‌తి స‌భ‌లో ప‌దేళ్లు కాదు ప‌దిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా తీసుకొస్తాన‌ని చంద్ర‌బాబు కుంటి సాకులు చెప్పార‌ని మండిప‌డ్డారు. వెంక‌య్య‌నాయుడు, చంద్ర‌బాబు నాయుడులు ఇద్దరూ త‌ల్లి పాలు తాగి ఆ రొమ్మును గుద్దిన మ‌హానుభావుల‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచిన ఇరువురు నాయుడులు వెన్నుపోటు బ్ర‌ద‌ర్స్‌గా నిలిచిపోతార‌న్నారు. తెలుగుప్ర‌జ‌ల‌కు ఏం చేశార‌ని స‌న్మానాలు చేసుకుంటున్నార‌ని రోజా సూటిగా ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వాటిని తీసుకొచ్చిన అనంత‌రం అద‌నంగా ఏమైనా తీసుకొస్తే దానిని ప్ర‌త్యేక ప్యాకేజీ అంటారని, ఆవిషయం తెలుసుకోవాలని చంద్ర‌బాబుకు సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కుల్లిపొయిన క్యాబెజీని ఏపీ ప్ర‌జ‌ల చెవుల్లో పెట్టాల‌నుకుంటే ప్ర‌జ‌లు పిచ్చివాళ్లు కాద‌న్నారు. ఇరువురు నాయుడులు క‌లిసిక‌ట్టుగా వెన్నుపోటు పొడిస్తే కేవ‌లం వెంక‌య్య‌నాయుడుకు మాత్ర‌మే ఎందుకు స‌న్మానాలు చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. 

ప్యాకేజీని ఆహ్వానించడంలో ఆంతర్యమేంటి బాబు..?
ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 24 వేల కోట్లు కావాలంటే... కేంద్రం రూ. 2100 కోట్లు మాత్ర‌మే కేటాయించింద‌న్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం రూ. 10వేల కోట్లు కేటాయించాల‌ని విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్నా, కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించ‌కున్న చంద్ర‌బాబు మాత్రం ప్యాకేజీని ఆహ్వానిస్తున్నానని అన‌డంలో అంత‌ర్యం ఏమిట‌న్నారు. పోల‌వ‌రం కోసం రూ. 33వేల కోట్లు కావాలంటే.. 2011 అంచ‌నాల ప్ర‌కారం కేవ‌లం రూ. 16వేల కోట్లు మాత్ర‌మే అని, అందులో కూడా దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇవ్వ‌మ‌ని అరుణ్‌జైట్లీ స్ప‌ష్టం చేశార‌ని, దీనివ‌ల్ల దాదాపు రూ. 12 నుంచి రూ. 13వేల కోట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఎగ్గొడితే చంద్ర‌బాబు దానిని స్వాగ‌తిస్తున్నాను అన‌డం దారుణ‌మ‌న్నారు. 

ఉన్నవాటినే కాపాడుకోలేని సీఎం..!
పోల‌వ‌రాన్ని పూర్తి చేయాల‌న్న చిత్త‌శుద్ధి టీడీపీకి లేద‌ని ఆరోపించారు. రాజ‌ధాని పరిపాల‌న భ‌వనానికి రూ. 43వేల కోట్లు కావాలంటే రూ. 3500కోట్లు కేటాయించార‌ని, రూ. 16వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే... దానిని పూర్తి చేయ‌డానికి రూ. 3900 కోట్లు మాత్ర‌మేన‌ని చంద్ర‌బాబు ఏ చీక‌టి ఒప్పందం ద్వారా ప్యాకేజీని స్వాగ‌తిస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదా 2014లో ఇస్తామ‌న్నార‌ని 14వ ఆర్థిక సంఘం 2016లో వ‌చ్చింద‌న్నారు. త‌న‌ని చూస్తే పరిశ్ర‌మ‌ల‌న్ని ప‌రిగెత్తుకుంటు వ‌స్తామ‌ని చెప్పుకునే చంద్ర‌బాబు త‌న సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోని మ‌న్న‌వ‌రం వెళ్లిపోతుంటే ఎందుకు ఆప‌లేక‌పోతున్నార‌ని నిల‌దీశారు. రాయ‌లసీమ అభివృద్ధి కోసం దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేంద్రంతో కొట్లాడి మ‌రి మ‌న్న‌వ‌రం బెల్ ప్రాజెక్టును తీసుకొచ్చార‌ని, ప్రాజెక్టు కోసం 700 ఎక‌రాలు, రూ. 6వేల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. బాబు అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి మ‌న్న‌వ‌రం ప్రాజెక్టుకు మౌళిక స‌దుపాయ‌లు క‌ల్పించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను కాపాడుకోలేద‌ని సీఎం... ఏ విధంగా కొత్త పరిశ్ర‌మ‌లు తీసుకొస్తార‌న్నారు.
Back to Top