బాబులిద్దరూ జైలుకెళ్లడం ఖాయం

నీతిమాలిన రాజకీయాలకు బాబు బ్రాండ్ అంబాసిడర్
బాబు అవినీతిని చూసి యావత్ దేశం నివ్వెరపోయింది
దమ్మూ, ధైర్యం గురించి మాట్లాడే అర్హత పప్పుకు లేదు
అవినీతిపై చంద్రబాబు అండ్ కో సీబీఐ విచారణకు సిద్ధమా..?
ఏ తప్పు చేయలేదని భార్య బిడ్డలపై ప్రమాణం చేయగలవా బాబు
టీడీపీ రాక్షస పాలన నుంచి ప్రజలు మేల్కోవాలిః రోజా

హైదరాబాద్ః  చంద్రబాబు రాజకీయాలకు పట్టిన క్యాన్సర్ అని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు .  ముందే ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే అన్ని రాష్ట్రాలను భ్రష్టుపట్టిస్తారని ఫైరయ్యారు. తండ్రీకొడుకులిద్దరూ రెండేళ్లలో లక్ష 34 వేల కోట్లు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో అన్ని పార్టీల నేతలకు వివరించామన్నరు. చంద్రబాబు అవినీతిని చూసి దేశం మొత్తం నివ్వెరపోతుందన్నారు. అన్ని పార్టీలు బాబు అవినీతిపై చర్చిస్తున్నాయని రోజా అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు బాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు గనుకే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్లు తాగిన కోతుల్లా అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతిపై ఎంక్వైరీ వేయాలని కేంద్రాన్ని కోరామని రోజా చెప్పారు. చంద్రబాబు, లోకేష్ లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. 

ఎన్నికల్లో నీవు ఇచ్చిన హామీలు, ప్రమాణస్వీకారం రోజు చేసిన సంతకాలు ఏమయిపోయాయి బాబు. విభజన చట్టం హామీలు ఎందుకు అమలు కావడం లేదని రోజా ప్రశ్నించారు.  వీటన్నంటిపై  ప్రజలకు సమాధానం చెప్పాలని రోజా బాబును డిమాండ్ చేశారు. దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్ మాట్లాడుతున్నాడు. దమ్మూ, ధైర్యం గురించి మాట్లాడే అర్హత సుద్దపప్పు అయిన లోకేష్ కు లేవని రోజా ఎద్దేవా చేశారు. ఆయనేంటో ప్రజలందరికీ తెలుసునని తూర్పారబట్టారు.  చంద్రబాబు అండ్ కోలంతా దొంగలు, ముద్దాయిలు, అవినీతిపరులని రోజా ఫైరయ్యారు. ఏ తప్పు చేయకపోతే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధపడాలని బాబుకు సవాల్ విసిరారు. 

జైలుకెళ్లిన వారు ఆరోపణలు చేయడమేంటని టీడీపీ నేతలు మాట్లాడడం పట్ల రోజా తీవ్రస్థాయిలో బదులిచ్చారు. చంద్రబాబు సోనియాతో కలిసి కుట్రలు చేయడం వల్లే వైఎస్ జగన్ జైలుకు వెళ్లాడు తప్ప ...తప్పు చేసి ఆయన జైలుకు వెళ్లలేదన్నారు.  తప్పు చేయలేదని నమ్ముతున్నాడు కాబట్టే ఇవాళ కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్నాడని, చంద్రబాబు లాగా స్టే తెచ్చుకొని చీకట్లో చిందబరం కాళ్లు పట్టుకోలేదని చురక అంటించారు. మీరు తప్పు చేయకపోతే విజయమ్మ పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై ఎంక్వైరీకి సిద్ధమా అని అడిగారు. తెలంగాణలో ఐఎంజీ స్కాంలో, ఓటుకు కోట్లు కేసులో విచారణకు సిద్ధమా అని చంద్రబాబును నిలదీశారు.  ఇలాంటి బాబు క్యారెక్టర్ చూసి టీడీపీలోకి వెళుతున్నామని ఎమ్మెల్యేలు చెబుతుంటే...వీళ్లకు ఓటేసినందుకు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన వారివెనుక ప్రజలు పోతారనుకోవడం తెలుగుదేశం నేతల భ్రమ అని అన్నారు. 

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక...ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ, ప్రతిపక్షం బలహీనమవుతోందని మీడియాతో చెప్పిస్తూ బాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. టీడీపీలోకి వెళుతున్న వాళ్లంతా వాళ్ల సొంత అభివృద్ధి కోసమే వెళుతున్నారని దుయ్యబట్టారు.  రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ గా మార్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక అవినీతి ఆంధ్రప్రదేశ్ చేశాడని విరుచుకుపడ్డారు. 

ఏపీ బ్రాండ్ చంద్రబాబు నాశనం చేస్తూ దాన్ని వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రోజా ఫైరయ్యారు.  ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఏపీకి చెడ్డపేరు తెచ్చింది చంద్రబాబు. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో అమాయక మహిళల్ని సెక్స్ కూపంలో దింపి ఏపీకి చెడ్డపేరు తీసుకొచ్చింది బాబు.  విజయవాడలో కూర్చొని కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తుంది బాబు. ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వకుండా మద్యం ఏరులై పారిస్తూ ఏపీకి చెడ్డపేరు తీసుకొచ్చింది చంద్రబాబు. రాజధాని పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తూ రైతుల కడుపు కొడుతున్నారు. ఎస్సీ, ఎస్టీల కడుపు కొడుతున్నారు. ఏపీ పేరును చంద్రబాబు పాడు చేస్తూ వైఎస్ జగన్ చేస్తున్నాడని చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని రోజా మండిపడ్డారు. 

వైఎస్ జగన్ సమర్ధుడు కాబట్టే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాడని, చంద్రబాబు లాగా పవన్ కల్యాణ్ , మోడీ కాళ్లు పట్టుకొని వెళ్లలేదని రోజా ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పప్పును సీఎం చేయాలన్న దుర్భుద్దితోనే బాబు ఇదంతా చేస్తున్నారని ఎండగట్టారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత కరెంటు, ఐదేళ్లలో 50 లక్షల ఇళ్ల నిర్మాణం సహా ఎన్నో సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని రోజా పేర్కొన్నారు. కానీ చంద్రబాబు పేరు చెప్పగానే కాల్ మనీ సెక్స్ రాకెట్, పట్టిసీమ దోపిడీ, పారిశ్రామిక వేత్తల నుంచి కమీషన్ ల కోసం జీవోలిస్తూ దోపిడీ. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక దోపిడీ,  హుద్ హుద్ కి వచ్చిన విరాళాలు, రాజధానికి కేంద్రం ఇచ్చిన నిధులు దిగమింగిన సంగతులే గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. 

సేవ్ డెమొక్రసీ మా నినాదమని రోజా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. ఓ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి మారవచ్చని ఏ చట్టం చెబుతుందో...ప్రతిదానికి అనుభవం ఉందని మాట్లాడే అవుట్ డేటెడ్ సీఎం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తూనే  జన్మభూమి కమిటీలతో ప్రజాప్రతినిధులకు విలువు లేకుండా చేశారు. ఎన్నికైన ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.  టీడీపీ వాళ్లకే గ్యాస్ సిలిండర్ , పెన్షన్, భూ పట్టాలు. ఇదేనా బాబు ప్రజాస్వామ్యం అని దుమ్మెత్తిపోశారు. 

ఆనాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు...ఇవాళ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నాడని రోజా ఆగ్రహించారు. వైస్రాయ్ హోటల్ లో ఎమ్మెల్యేలను కొంటూ ఎన్టీఆర్ ను క్షోభ పెట్టిన బాబు..ఇవాళ విజయవాడలోని అక్రమ కట్టడంలో నివాసముంటూ ఎమ్మెల్యేలను కొని వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. బాబుకు ఏమాత్రం పౌరుషం , దమ్ము, ధైర్యం ఉన్నా ...అవినీతి చేయలేదని చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వినాయకుడిపై ప్రమాణం చేయాలన్నారు . ఎమ్మెల్యేలకు డబ్బుల మూటలు ఇవ్వలేదని  నీ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేయగలవా బాబు అని నిలదీశారు. తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలను, ప్రతిపక్షాన్ని అవమానిస్తూ ...చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నందునే జాతీయస్థాయిలో తాము పోరాడాల్సి వచ్చిందని రోజా చెప్పారు. 

బాబు అవినీతి, అక్రమాలను వైఎస్ జగన్ చీల్చిచెండాడుతున్నాడు గనుకే...భయంతో బాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రోజా విరుచుకుపడ్డారు. ఏపీ బ్రాండ్ కాపాడేందుకే వైఎస్ జగన్ పోరాడుతున్నారని చెప్పారు.  బాబు బ్రాండ్ కరువు అని రోజా ఎద్దేవా చేశారు. బాబు వస్తే కరువు వస్తుందని మరోసారి నిరూపించుకున్నాడని అన్నారు. చంద్రబాబు లెగ్ మహిమ వల్లే కరువు వచ్చిందని, శ్రీశైలంలో నీళ్లు అడుగంటిపోయాయని రోజా తూర్పారబట్టారు.  ప్రజలు చైతన్యవంతులై టీడీపీ నేతల తప్పులను నిలదీయాలన్నారు. లేకపోతే మరో మూడు సంవత్సరాల్లో బాబు రాక్షస పాలన చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
Back to Top