హోదా ముసుగులో రహస్యభేటీలు

చంద్రబాబుతో చీకటి ఒప్పందాల్లో అవ్వా సీతారాం
అగ్రిగోల్డ్‌ కేసులో ఇప్పటికీ వరకు అరెస్టు కానీ వ్యక్తి
ఆ బోగస్‌ కంపెనీలు ఎవరివో గుర్తించాలి
అందుకే సీబీఐ ఎంక్వైరీ జరగాలి
విజయవాడ: ప్రత్యేక హోదా ముసుగులో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు జాతీయ నేతల మద్దతు కూడగట్టాల్సింది పోయి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు కుయుక్తులు పన్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ నెల 3వ తేదీ 10 గంటల సమయంలో ఏపీ భవన్‌లో అగ్రిగోల్డ్‌ టేకోవర్‌ చేస్తామన్న జీఎస్సెల్‌ సంస్థ అధినేత సుభాష్‌చంద్ర, అమర్‌సింగ్, అరెస్టు కాకుండా లిస్ట్‌లో ఉన్న మరో వ్యక్తి అవ్వా సీతారాం ముగ్గురితో రహస్యభేటీ నిర్వహించాడని మండిపడ్డారు. రాష్ట్రానికి పెద్దగా ఉండి.. ప్రజల కష్టాలను తీర్చాల్సిన చంద్రబాబు వారికి న్యాయంగా రావాల్సిన ఆస్తులను కాజేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ముగ్గురితో చంద్రబాబు సంప్రదింపులు చేసి వాటాలు కుదరక ఒప్పందాలు విభేదాలు వచ్చి జీఎస్సెల్‌ కంపెనీతో ఆస్తులను టేకోవర్‌ చేయలేమని చెప్పించారన్నారు.  అగ్రిగోల్డ్‌ కంపెనీ వారు హోదా గురించి మాట్లాడేందుకు వచ్చారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చంద్రబాబు తరుపున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారన్నారు. అంటే ఏ రకమైన రాజకీయాలు చేస్తున్నారో ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. 

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ. 6,380 కోట్లు 87 బోగస్‌ కంపెనీలకు మళ్లించారని చెప్పారని, ఆ 87 కంపెనీలు ఎవరివి.. ఆ డబ్బును ఏ విధంగా రికవరీ చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేస్తే ఆ కంపెనీలు ఎవరివి.. ఎంత డబ్బు దోచుకున్నారు.. వాటి వెనకాల ఎవరున్నారనే విషయాలన్నీ బయటపడతాయన్నారు. అదే విధంగా అర్ధరాత్రి ఏపీ భవన్‌లో జరిగిన సంఘటనను సీబీఐ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అంబేద్కర్‌ జయంతిన రైతుల నుంచి చౌకధరలకు లాక్కున్న భూములను ఇచ్చి తప్పు జరిగిందని లెంపలేసుకొని చెబితే.. కొంతైనా సంఘం పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా ప్రజలు భావిస్తారన్నారు. 
 
Back to Top