బాబుకు మంచిబుద్ధి ప్రసాదించు భగవంతుడా2017లో ఆంధ్రరాష్ట్రంలో ప్రజస్వామ్యం అపహాస్యం
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిపాలన అందించు బాబూ
ప్రజాస్వామ్య మూలస్తంభాలను దుర్వినియోగం చేస్తున్నాడు
విశాఖ: నూతన సంవత్సరం 2018లో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించేలా అధికారంలో ఉన్న నాయకులకు భగవంతుడు మంచిబుద్ధి ప్రసాదించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కాంక్షించారు. 2017 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగు వ్యవస్థలను చంద్రబాబు దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాను చంద్రబాబు తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాడన్నారు. 
శాసనవ్యవస్థ..
ప్రజల స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మంచి చట్టాలు రూపొందించాల్సిన సభను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కొని రాజ్యాంగాన్ని అగౌరవపరిచారని మండిపడ్డారు. అంతే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజకీయ శాసనవ్యవస్థను చంద్రబాబు కించపరిచారని మండిపడ్డారు. ఇలాంటి సాంప్రదాయం దేశ చరిత్రలోనే ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తప్ప శాసనసభకు రామని సభను బహిష్కరించామన్నారు.  
కార్యనిర్వాహక వ్యవస్థ..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు కించపరిచారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే వాటిని ఇష్టానుసారంగా ప్రజావ్యతిరేకంగా సవరణలు చేస్తున్నాడన్నారు. ప్రభుత్వానికి అవసరం మేరకు భూ సేకరణ చేపట్టాలని చట్టం చెబుతుంటే చంద్రబాబు మాత్రం మూడు పంటలు పండే రైతుల భూములను లాక్కుంటున్నాడని ఫైరయ్యారు. సాక్షాత్తు అన్నం పెట్టే రైతన్నకు నష్టం వచ్చేలా జులుం చేసి అవినీతి అవసరాల కోసం చట్టాన్ని సవరణ చేశారన్నారు. అంతే కాకుండా స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని దేశమంతా వ్యతిరేకించినా, హైకోర్టు కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని చెప్పినా వినకుండా చట్టాన్ని సవరణ చేసిన సంఘటన 2017లోనే జరిగాయన్నారు. 
పోలీస్‌ వ్యవస్థ...
పోలీసు వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని చంద్రబాబు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు శాంతియుతంగా ధర్నాలు, ఆందోళనలు చేసినా.. పోలీసులను అడ్డం పెట్టుకొని అడ్డుకుంటూ వ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు. మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే చట్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. అదే విధంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడన్నారు. 
మీడియా వ్యవస్థ..
రాష్ట్రంలో జరిగే వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపించే మీడియా వ్యవస్థను కూడా చంద్రబాబు నాశనం చేశాడని బొత్స ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌ అనే దానిని తీసుకువచ్చి వారికి నచ్చిన వార్తలను, వారి బొమ్మలను చూపించుకోవాలని చూస్తున్నాడన్నారు. మిగతా రాజకీయ పార్టీల గొంతులను నొక్కేయడానికి ఫైబర్‌ గ్రిడ్‌ తీసుకువచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగు వ్యవస్థలు ఉంటే ఏ ఒక్కదానిని కూడా చంద్రబాబు చట్టబద్ధంగా నడిపించడం లేదన్నారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అమాయకుల ప్రాణాలు బలి..
విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో సుమారు 22 మంది మరణించారని, అయినా దానిపై ఇప్పటికీ విచారణ జరిపించలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. అది జరిగిన తరువాత కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి అమరావతికి వస్తే వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అనుమతిలేని బోటులో తిప్పారన్నారు. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థం అవుతుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ల ద్వారా 50 శాతం నిధులు కూడా వారికి ఖర్చు పెట్టడం లేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై దాడి విపరీతంగా జరుగుతున్నాయన్నారు. పెందుర్తి జె్రరిపోతులపాలెంలో దళిత మహిళలపై దాడి చేసి వివస్త్రను చేశారన్నారు. అదే విధంగా ప్రభుత్వం గొప్పగా అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్నామని చెప్పిందని, ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా అక్కడ పేర్చలేదన్నారు. అంటే ఏ విధంగా దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. 
 
Back to Top