బాబు చేతగానితనం వల్లే రాష్ట్రానికి నష్టం

బడ్జెట్‌లో ఏపీ ప్రయోజనాలు లేకపోవడం బాధాకరం
హక్కులు సాధించలేక అన్యాయం జరిగిందని లీకులా?
కేంద్రంతో సఖ్యతగా ఉండి చంద్రబాబు సాధించేంటి
ఏమయ్యారు చంద్రబాబు లెఫ్ట్, రైటూ
ప్రతిపక్ష ఉద్యమాలు అణగదొక్కి స్వలాభం చూసుకున్న చంద్రబాబు
మీ అనుభవం, పరిచయాలతో రాష్ట్రం ఏం అభివృద్ధి చెందింది
వాస్తవాలు ప్రజలకు తెలిసాయని కొత్త డ్రామాలు తెరమీదకు
కాంట్రాక్టుల కోసం పోలవరం లాక్కుంది వాస్తవం కాదా
హైదరాబాద్‌: చంద్రబాబు చేతగానితనం వల్ల ఆంధ్రరాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అది తేటతెల్లమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేని సీఎం, బడ్జెట్‌ సమావేశాలు అయిన తరువాత చంద్రబాబు తన ప్రచార మాధ్యమాల ద్వారా అన్యాయం జరిగిందని లీకులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మీ డ్రామాలు కట్టిపెట్టండి చంద్రబాబూ అని బొత్స సూచించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఏ ఒక్కటైనా ఇప్పటి వరకు జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్రం నెరవేర్చిందా అని ప్రశ్నించారు. 
మొదటి నుంచి అన్యాయమే..
కేంద్రం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ నుంచి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలు చేస్తుంటే.. కేంద్రంతో సఖ్యతగా ఉండాలని, ప్రతిపక్షాలు బీజేపీతో జతకట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని బురదజల్లిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. కేంద్రంతో భాగస్వామ్య ప్రభుత్వంగా ఉండి ఏం సాధించారు చంద్రబాబూ అని బొత్స నిలదీశారు. ఎన్నికల సమయంలో నాకున్న అనుభవం, పరిచయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో గుర్తు చేసుకోవాలన్నారు. ఏమైంది మీ అనుభవం.. మీ స్నేహాలని నిలదీశారు. దీనంతటికీ చంద్రబాబు స్వార్థం, స్వలాభం ఒక్కటే కారణమని బొత్స ఉద్ఘాటించారు.  తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని కేంద్రం కంటే ముందే చంద్రబాబు గొంతు చించుకున్నది వాస్తవం కాదా..? ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంది.. చెప్పిన చంద్రబాబు ఇన్ని సంవత్సరాల్లో సాధించిందేంటని ప్రశ్నించారు. 
లీకులతో మరో కొత్త డ్రామా..
రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయాయని అన్యాయం జరిగిపోయిందని లీక్‌లు ఇస్తూ చంద్రబాబు కొత్త డ్రామాను తెరమీదకు తీసుకువస్తున్నాడని బొత్స ధ్వజమెత్తారు. గత పదిహేను రోజులుగా చంద్రబాబు వ్యాఖ్యలు గమనిస్తే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అర్థమైందన్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని కలిసిన అనంతరం ప్రెస్‌మీట్‌లో నాకు లెఫ్ట్, రైటు కేంద్రమంత్రులు ఉన్నారని, వారే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతారని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ లెఫ్ట్, రైటు ఎటుపోయారన్నారు. తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇద్దరిని కేంద్రమంత్రులుగా పెట్టారన్నారు.  భాగోపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ విషయంలో ఒక మంత్రి తతంగం.. ఇంకో మంత్రి చేసే పనులు దేశ ప్రజానికానికి మొత్తం తెలుసన్నారు. 
చట్టంలోని అంశాలను కాలరాస్తున్న చంద్రబాబు
చట్టంలో పెట్టిన అంశాలను సైతం చంద్రబాబు కాలరాస్తున్నాడని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ అన్నాడు.. విశాఖ రైల్వేజోన్‌ అడిగితే.. చట్టంలో ఉంటే వచ్చేది కదా అని మాట్లాడుతాడు.. చట్టంలో ఉన్న దుగ్గరాజుపట్నం పోర్టును పక్కనబెట్టి దానికి బదులు ఎకనామిక్‌ జోన్‌ ఇవ్వమని అడుగుతున్నాడని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలోచనలతోనే రాష్ట్ర పూర్తిగా నష్టపోతుందన్నారు. బాబు అనుభవం అవినీతికి తప్ప.. రాష్ట్రం ఆర్థికంగా, మలికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతానంటే కాదు మాకివ్వండి అని చెప్పి డ్రామాలు చేసి లాక్కున్నారన్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదాను  తాకట్టుపెట్టారని బొత్స మండిపడ్డారు. 
చంద్రబాబులో బలహీనత ఉంది..
అమ్మ పెట్టదు.. అడుక్కు తిన్నివద్దు అన్న చందంగా చంద్రబాబు నైజం ఉందన్నారు. మొదటి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పోలవరానికి రూ. 100 కోట్లు కేటాయించారో.. అప్పుడే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, కలిసికట్టుగా ఉద్యమం చేద్దామని చెప్పడం జరిగిందన్నారు. ప్రతిపక్ష డిమాండ్‌ను పెడచెవినపెట్టి బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. విభజన హక్కుల సాధనకు అనేక సందర్భాల్లో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి రిక్వస్ట్‌లు, ధర్నాలు చేస్తామని బొత్స చెప్పారు. విశాఖ రైల్వేజోన్‌ కోసం ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని రాష్ట్ర సర్కార్‌ అణగదొక్కే ప్రయత్నం చేసిందన్నారు. మీ భాగస్వామ్య ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారంటే చంద్రబాబులో బలహీనత ఉందని తేటతెల్లమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు కోట్ల కేసులో దొరికిపోయి ముద్దాయిగా మారిన తరువాత ఆర్భాటంగా ఏపీకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టారని విరుచుకుపడ్డారు. బాబు లాంటి చేతగాని ముఖ్యమంత్రి ఉండడం వల్లే బడ్జెట్‌లో ఆంధ్రరాష్ట్ర పేరు లేదన్నారు. 
 
Back to Top