హక్కును కాలరాసే అధికారం నీకెక్కడిది

బాబు మోడీని కలిసింది వ్యక్తిగత స్వార్థం కోసమే
ఇంకా ఎన్ని రోజులు పాడిన పాటే పాడుతావు చంద్రబాబూ
నాలుగేళ్లుగా విభజన చట్టంలోని ఏ హామీలను సాధించావ్‌
45 నిమిషాలు ఏ అంశాలపై చర్చించావో చెప్పాలి
దుగ్గరాజుపట్నం పోర్టును వద్దనే హక్కు నీకెక్కడిది
ఇప్పటి వరకు రైల్వేజోన్‌ సాధించలేనిది నీ అనుభవం
ఇంకా బాబు సీఎంగా ఉంటే 25 ఏళ్లు వెనక్కువెళ్తాం
దుగ్గరాజుపట్నం ఎందుకు వద్దన్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: విభజన చట్టంలోని హక్కులను వద్దనే అధికారం మీకు ఎవరిచ్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. దుగ్గరాజుపట్నం పోర్టుకు బదులుగా రెండు ఎకనామిక్‌ జోన్స్‌ ఇవ్వాలనే హక్కు నీకెడిదని విరుచుకుపడ్డారు. ఈ లెక్కన నీ స్వార్థం కోసం ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టివుంటావని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసింది స్వార్థ రాజకీయాల కోసమేనా అని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానితో భేటీ అనంతరం బయటికొచ్చిన అనంతరం ప్రెస్‌మీట్‌ పెట్టిన ముఖ్యమంత్రి 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారన్నారు. అవి నాలుగు సంవత్సరాలుగా అడుగుతున్న అంశాలేనని, విశాఖపట్నం రైల్వేజోన్, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఇవే తప్ప కొత్త అంశాలను ఏమీ అడగలేదని, అడిగిన వాటిల్లో ప్రధాని దేనికి అంగీకరించారో కూడా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదన్నారు. 45 నిమిషాల పాటు ప్రధానితో ఏఏ అంశాలను చర్చించారో చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. 

దేశంలోనే అందరికంటే సీనియర్‌ ముఖ్యమంత్రిని, అందుకే నన్ను ప్రజలు ఎన్నుకున్నారని పదే పదే చెప్పే చంద్రబాబు నాలుగేళ్ల నుంచి కేంద్రం నుంచి సాధించిందేంటో చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి వెసులుబాటు కల్పించాలని కోరాం అంటున్నారు కానీ, మీరడిన 20 అంశాల్లో ప్రధాని దేనిని త్వరగా నెరవేరుస్తానని చెప్పారో స్పష్టం ఇవ్వాలన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి వెలుసుబాటు ఇవ్వాలని కోరడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ. లక్షా 20 వేల కోట్ల అప్పు చేశారని ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ. 16 వేల కోట్లేనని, మిగిలిన డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారో లెక్కలు చూపించాలన్నారు. విభజన చట్టంలోని అంశాలను, తరువాత రాజ్యసభలో అప్పటి ప్రధాని ఇచ్చిన హోదా హామీని తాకట్టుపెట్టి ప్యాకేజీని తీసుకువచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు ప్యాకేజీ కూడా ఇవ్వలేదని చెబుతున్నారన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టబోతుందని, ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి.. ఈ రాష్ట్రానికి మీరు సాధించిందేంటని ప్రశ్నించారు. 

విభజన చట్టంలో 30 షెడ్యుల్‌ సెక్షన్‌ 93లో పెట్టిన దుగ్గరాజుపట్నం పోర్టు ఇవ్వకపోయినా పర్వాలేదు.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు ఎకనామిక్‌ జోన్స్‌ ఇవ్వాలని అడిగే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు. పోర్టు, రెండు ఎకనామిక్‌ జోన్స్‌ అడిగినా తప్పులేదు కానీ విభజన చట్టంలోని అంశాలను వద్దంటారా అని బొత్స చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓటేసిన పాపానికి నీ సొంతానికి, స్వార్థానికి రాష్ట్రాన్ని తాకట్టుపెడతావా.. ఇదేనా నీ రాజకీయ చతురత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ప్రత్యేక హోదాను కూడా తాకట్టుపెట్టివుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దేనికోసం దుగ్గరాజుపట్నం పోర్టు తాకట్టుపెడుతున్నావో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు ప్రధాని మోడీని కలిసి తన స్వలాభం, స్వార్థం కోసమేనని బొత్స ఆరోపించారు. విభజన చట్టంలోని అంశాలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. నిలదీస్తే పోలవరం అవకతవకలపై, కేంద్ర నిధులతో మీరు చేసిన దోపిడీపై విచారణ చేపిస్తారని భయం చంద్రబాబులో ఉందన్నారు. ఇప్పటి వరకు అనేకసార్లు ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారని, కానీ ఎప్పుడూ చెప్పిందే చెబుతున్నారన్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టిన తరువాత విశాఖ రైల్వేజోన్‌ పెట్టితీరాలనే మాట సీఎం నోటి నుంచి రాకపోవడం బాధాకరమన్నారు. రైల్వేజోన్‌ను కూడా సాధించలేకపోయారు ఇదేనా మీ అనుభవం చంద్రబాబు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన అంశాలకంటే రాజకీయం, వ్యక్తిగత లావాదేవీలే చంద్రబాబుకు ముఖ్యమైపోయిందన్నారు. చంద్రబాబు ఇంకా ఇక్క క్షణం ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కు వెళ్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అభివృద్ధి చెందదన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టు ఎందుకు వద్దంటున్నారు..? విభజన అంశాలను ఎప్పుడు సాధిస్తారు..? వీటిపై వివరణ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top