కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది నీవు కాదా బాబూ?



–వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఆరోపణలు చేయడం దౌర్భాగ్యం
–చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతమే రాష్ట్ర విభజనకు కారణం
– రాష్ట్ర విభజనకు చంద్రబాబే మూల కారకుడు
–రాష్ట్ర విభజన అంశాన్ని చంద్రబాబు తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు
– రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌ మభ్యపెట్టారు

విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే కారణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆనాడు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కైంది చంద్రబాబు కదా అని ఆయన నిలదీశారు. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మభ్యపెట్టారని ఆయన మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తమ్ముడు టీడీపీలో చేరిక సందర్భంగా నిన్న చంద్రబాబు చేసిన ఆరోపణలను బొత్స సత్యనారాయణ ఖండించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కలిసి రాష్ట్ర విభజనకు కారణమని చంద్రబాబు అనడం దుర్మార్గమన్నారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతగానో పోరాడాడని చంద్రబాబు పొగడటం ఆయన నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంపై ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్న తరుణంలో మరోమారు రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి వైయస్‌ఆర్‌సీపీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. 

రాష్ట్ర విభజన జరుగకూడదని ఎప్పుడైనా అన్నారా?
ఎప్పుడైనా రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు అన్నారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ రోజు రెండు కళ్ల సిద్ధాంతం అని చెప్పి, పార్లమెంట్‌లో తీర్మానం పెట్టండి మేం సమర్ధిస్తామని ఎ్రరం నాయుడితో ఆ లేఖ పంపించింది మీరు కదా అని నిలదీశారు. 2009లో సీఎంగా రోశయ్య అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగినప్పుడు ఇప్పుడు కేంద్రంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్న అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దుల కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నరసింహులను సమావేశానికి పంపించింది మీరు కదా అన్నారు.  అసెంబ్లీలో మేం మద్దతిస్తామని చెప్పింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆ రోజు రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదు కదా  అన్నారు. ఈ రోజు ఆ రెండు పార్టీలు అంటూ నిందలు మోపుతారా అని మండిపడ్డారు. ఆ రోజు కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేను బ్యాట్స్‌మెన్‌ను నాకు అన్ని తెలుసు అని ప్రజలను మభ్యపెట్టారన్నారు. 

మీకు ఎంత తెలుసో...నాకు తెలుసు
ఆ రోజు రాష్ట్ర విభజనకు సంబంధించి చంద్రబాబుకు ఎంత తెలుసో..నాడు పీసీపీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తెలుసు అని బొత్స సత్యనారాయణ అన్నారు.  మీ రాజకీయ మనుగడ కోసం రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆ రోజు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మీరు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు మద్దతిచ్చింది వాస్తవం కాదా అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, విభజించిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. అవాకులు, చవాకులు పేల్చుతూ సమయం వృథా చేయవద్దని సూచించారు. ఏ సందర్భంలో కాంగ్రెస్‌తో మేం జత కట్టామో ఆ నేపథ్యం చెప్పాలని పట్టుబట్టారు. ఆ రోజు రాష్ట్ర ఖజానాను దోచుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తే దాన్ని చేయడానికి వీలు లేదని నేను అడ్డుపడ్డానని, ఆ పక్రియను ఆపింది వాస్తవం కాదా అన్నారు. మీరు లోపాయికారిగా ప్రభుత్వాన్ని సమర్ధించింది వాస్తవం కాదా అన్నారు. రహస్య జీవోలు తీసుకువచ్చి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టింది మీరు కదా అని నిలదీశారు. రాష్ట్ర విభజనకు కారణమైన మీరు ఈ రోజు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత మీ రాజకీయ అవసరాల కోసం కొత్త పార్టీలు పెట్టించి, వారి ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్రమంతా చూసిందన్నారు. 

కాంగ్రెస్‌తో లాలూచీ పడింది మీరు కాదా?
ఆ రోజు అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో లాలూచీ పడ్డారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌ పార్టీలో జతకట్టిన మీరు ఇవాళ మాపై నిందలు వేస్తారా అని మండిపడ్డారు. నాడు ఒడ్డున కూర్చుని మాట్లాడిన మీరు రాష్ట్ర విభజన జరిగితే ఐఐటీలు, ఐఎంఎంలు వస్తాయని ప్రజలను మభ్యపెట్టి తీరా గెలిచిన తరువాత వాటిని విస్మరించారని నిప్పులు చెరిగారు. సంజీవని లాంటి ప్రత్యేక హోదాను స్వార్థం కోసం తాకట్టు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. నీ అంత అనుభవం లేకపోవడం వల్ల, నీలాంటి టక్కు టమారా విద్యలు మాకు తెలివన్నారు.
 
Back to Top