శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాం
బాధితులు పోరాటాలు, ఆత్మహత్యలు చేసుకున్నా బాబులో చలనం లేదు
అగ్రిగోల్డ్‌ ఆస్తులు జప్తు చేసి బాధితులను ఆదుకోలేరా..?
ఆ ఆస్తులపై ప్రభుత్వ పెద్దల కన్ను
న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీసీ పోరాడుతుంది
లేనిపక్షంలో సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది
అన్ని రకాలుగా ఆదుకుంటాం.. అండగా ఉంటాం
విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో ఎంతో మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలు నలిగిపోతుంటే చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, ఆదిమూలపు సురేష్, పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సుధాకర్‌బాబు, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు, ఏజెంట్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులు దాదాపు 20 లక్షల మందికిపైగా ఉన్నారన్నారు. బాధితులు ప్రభుత్వాన్ని కలిసి సమస్య చెప్పుకున్నా.. ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాని పరిస్థితి నెలకొందన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణంతో సుమారు 170 మంది ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ సమస్యపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారని బొత్స గుర్తు చేశారు. అసెంబ్లీలో బాధితులపై వైయస్‌ జగన్‌ చర్చించారన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు పార్టీ తరుపున అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీని కూడా నియమించారన్నారు.  కమిటీ ద్వారా సమస్యకు పరిష్కారం తీసుకురావాలని చెప్పారన్నారు. ఈ రోజు సమావేశమై కార్యచరణను రూపొందించడం జరిగిందన్నారు. 

2014లో అగ్రిగోల్డ్‌ సంస్థ ఖాతాదారులకు ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో వారంతా కోర్టు, పోలీస్‌ స్టేషన్‌లను ఆశ్రయించారన్నారు. తరువాత బాధితులంతా ఐక్యంగా ఉద్యమం చేపట్టారన్నారు. ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే బాధితులంతా ఐక్యంగా ఉద్యమం చేశారని, అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాన్ని కూడా కలిసి వారి సమస్యను చెప్పుకున్నారని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఉన్నాయని ప్రభుత్వం ధైర్యం చెప్పి ఇప్పుడు వారిని పట్టించుకోకుండా ఆ ఆస్తులపై కన్నువేసిందన్నారు. 

రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితులు 170 మందికిపైగా చనిపోయారని, వారికి రూ. 10 లక్షల పరిహారం ప్రభుత్వం అందించాలని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారన్నారు. అంతే కాకుండా వారి డబ్బు సుమారు రూ. 7 వేల కోట్లు చెల్లించాలని, ప్రభుత్వమే ఆస్తులను జప్తు చేసుకొని డబ్బులు చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. అదే విధంగా విజయవాడలో జరిగిన బాధితుల ధర్నాలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం.. 20 లక్షల మందిలో రూ. 11 వందల కోట్లు చెల్లిస్తే 13 లక్షల కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని డిమాండ్‌ చేశారన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 3 లక్షలు ఇస్తానని అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు తరువాత రూ. 5 లక్షలు ఇస్తానని జీఓ విడుదల చేశారన్నారు. కుంభకోణం జరిగి ఇప్పటికీ మూడున్నరేళ్లు గడుస్తున్నా.. 170 మందిలో ఇద్దరికి మాత్రమే పరిహారం అందిందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 5 లక్షల ఎందుకు ఇవ్వడం లేదంటే ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదన్నారు. 

సీబీసీఐడీ అధికారి తిరుమలరావు అగ్రిగోల్డ్‌ ఆస్తులు సుమారు రూ. 35 వేల కోట్లు ఉన్నాయని చెప్పారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ ఆస్తులను జప్తు చేసుకొని రూ. 20 వేల కోట్లు ఇవ్వలేకపోయిందా అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి సంస్థ వచ్చి ఆస్తులు విక్రయిస్తానంటే వాటిని పరిశీలించేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదని, ఆస్తులపై ప్రభుత్వ పెద్దల కన్ను ఉందని తేటతెల్లమైందన్నారు. ఆస్తులను దోచుకోవాలనే దుర్బుద్ధి లేకపోతే ఎందుకు పరిష్కారం చేయడం లేదని ప్రశ్నించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ ప్రతి జిల్లాలో పర్యటిస్తుందని బొత్స సత్యనారాయణ వివరించారు. బాధితులను కలుసుకొని వారినితో మాట్లాడనుందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కూడా పరిశీలిస్తామన్నారు. బాధితులకు అండగా ఉంటూ శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, వెంటనే రూ. 11 వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  ఇప్పటికైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఇంకో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయని, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్‌ జగన్‌ మాట ప్రకారం బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. 
 
Back to Top