బూటకం.. ప్రహసనం

హైదరాబాద్, 01 ఫిబ్రవరి 2013:

రాష్ట్రంలో గురువారం నిర్వహించిన సహకార సంఘాల ఎన్నికల మొదటి విడత బూటకంగా ప్రహసనంగా సాగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నిర్వహించిన వాటిలో అరవై శాతం  గెలుచుకున్నామని పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పడం చిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.  ఆ పార్టీ తొలినుంచి తనకు అనుకూలంగా ఉన్నవారినే సొసైటీలలో సభ్యులుగా చేర్చుకుని హస్తగతం చేసుకోవడానికి పావులు కదిపిందన్నారు. ఈ విషయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడే చెప్పిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరిగిందని సోనియాకు చెప్పుకోవడానికే సహకార ఎన్నికలను ఉపయోగించుకుందని అంబటి చెప్పారు. సొసైటీలో ఒక్క రోజునే పది లక్షలకు పైగా సభ్యులను చేర్చుకున్న సంఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని అంబటి చెప్పారు. సుమారుగా 80 సొసైటీల ఎన్నికలను సంబంధిత మంత్రే శాంతిభద్రతల సమస్యను చూపి వాయిదా వేశారనీ, ఆయా సొసైటీలలో కాంగ్రెస్ గెలవదని తేలడమే దీనికి కారణమనీ ఆయన తెలిపారు.

బలముందనుకుంటే మధ్యంతరానికి సిద్ధం కండి

      మీకు బలముందని భావిస్తే అసెంబ్లీ మధ్యంతర ఎన్నికలకు రావాలని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెబుతున్నారన్నారు. కనీసం వారి పేర్లు చెప్పే స్థితిలో ఆయన లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని బహిష్కరించామంటున్నారనీ, అసలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడనిది ఎవరో చెప్పాలనీ ఎద్దేవా చేశారు. ఇంతమందిని బహిష్కరించిన తర్వాత శాసన సభలో మీ బలమెంతని ప్రశ్నించారు. 'మీకోసం వస్తున్నా'నంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబూ! మునిగిపోయే పడవలా ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజా బలాన్ని దృష్టిలో ఉంచుకుని శాసన సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని అంబటి కోరారు.  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండడానికి అనర్హుడని పేర్కొన్నారు. పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీలో కుమ్మక్కయినట్లు ప్రజలకు తెలిసిపోయే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీనే విశ్వాసాన్ని నిరూపించుకోవలసిన సమయమిదని స్పష్టంచేశారు. పార్టీ నుంచి బహిష్కరించామని చెబుతున్నారనీ, వారంతా కాంగ్రెస్ పార్టీ వారేనా అని బొత్సను ప్రశ్నించారు. జైలుకెళ్ళి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారిని కలిసిన వారు ఐదుగురే కనిపిస్తున్నారనీ, మిగిలిన వారెవరనీ ఆయన అడిగారు. ఎవర్ని బహిష్కరించారో చెప్పుకోలేని పరిస్థితిలో పీసీసీ అధ్యక్షుడున్నారనీ, ఇది చాలు కాంగ్రెస్ ఎలా ఉందో తెలుసుకోవటానికి అని ఆయన ఎద్దేవా చేశారు.


సహకార సంఘాలవీ ఒక ఎన్నికలేనా?


     సహకార సంఘాలకు నిర్వహించినవి ఎన్నికలా అని ఆయన ప్రశ్నించారు. 'ఒక్కో సొసైటీలో అసలు  ఎన్ని ఓట్లున్నాయి.. ఓటర్ల నమోదులో ఎన్ని అవకతవకలు చోటుచేసుకున్నాయి' అని ప్రశ్నిస్తూ.. దాదాపు అన్ని సొసైటీలలో సభ్యులను నామినేట్ చేసిన మాదిరిగా ఎన్నికలు సాగాయని అంబటి ధ్వజమెత్తారు. ఎక్కువ సొసైటీలలో గెలుపొందామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ఉందో తెలిసిందేనన్నారు. పంచాయతీలకూ, మున్సిపాల్టీలకూ, జిల్లా పరిషత్తులకూ ఎన్నికలు చేపట్టారా అని నిలదీశారు. ఈ ఏడాది మార్చికి సొసైటీలు ఎన్నికల కమిషన్ పరిథిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి హడావుడిగా వీటిని నిర్వహించారని తెలిపారు. తమ అధికార బలంతో చేసిన కుమ్మక్కు కుట్రల కారణంగా లభించిన ఫలితాలను సోనియాకు చూపేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ బలం విపరీతంగా పెరిగిందని చెప్పుకోవడానికే సరిపోతుందన్నారు. ఇదే విషయాన్ని మేము ఎప్పుడో చెప్పామన్నారు. ఎక్కువ సొసైటీను గెలుచుకున్నామని చెప్పడం బూటకమనీ, అధికార బలంతో కుట్రలు చేసి, గెలిచిన వారిని తమకు జై కొట్టించుకున్నారనీ ఆయన తెలిపారు. ఏ పార్టీతోనూ లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదని అంబటి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ధైర్యంగా ఉన్నాం కాబట్టే మామీద సమ్మెట దెబ్బలు పడుతున్నాయన్నారు.

Back to Top