పెందుర్తి ఎమ్మెల్యేపైనా కేసులు నమోదు చేయాలి

విజయవాడ : పెందుర్తి నియోజకవర్గంలో దళిత మహిళను వివస్త్రను చేసిన సంఘటనపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని వైయస్‌ ఆర్‌ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్‌ చేశారు. విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలోఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంఘటనలో బాధితులకు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామనడం పట్ల ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తన  ఆలోచనలకు అనుగుణంగా కాకుండా,దళితుల రక్షణకు ఉన్న చట్టాలకు అనుగుణంగా పనిచేయాలన్న ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. తప్పితే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్న కనీస ధర్మం కూడా తెలియదా? అని నిలదీశారు. ముద్దాయిలను పట్టుకున్న తరువాత, ఆకుటుంబాన్ని ఏవిధంగా ఆదుకోవాలి వంటి విషయాలపై చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దళితులహక్కుల కేసులను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తూ, కేసును వక్రీకరించే  వారిపైనా కేసులు పెట్టవచ్చన్న చట్టం ప్రకారం ఎమ్మెల్యేబండారుపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల భూములపై చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో ఎమ్మెల్యే డూడూ బసవన్న అని, ఈ ఆటలో దళితులను పావులను చేస్తున్నారని నాగార్జున విమర్శించారు.
దళితులపై ఎటువంటి దాడులుజరిగినా, అన్యాయం జరిగినా ఆదుకోడానికి వైయస్‌ ఆర్సీపీ ముందుంటుందని ఆయన అన్నారు. మహిళపై జరిగిన దాష్టీకం విషయంలో మహిళా లోకం ఏమాత్రం ఉపేక్షించబోదని హెచ్చరించారు. దళితుల హక్కుల పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.

Back to Top