సబ్సిడీ నొక్కేసేందుకు కుట్రలు

మునగపాక: కార్పొరేషన్‌ రుణాల పేరిట రూ.కోటి మేర సబ్సిడీ స్వాహా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ ఆరోపించారు. మండలస్థాయి అధికారులు, బ్యాంక్‌ అధికారులు కుమ్మకై ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు బీసీ, ఎస్‌సీ, కాపు కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేసేందుకు ఇంటర్య్వూలు నిర్వహించారన్నారు. అయితే నిబంధనలకు వ్యతిరేకంగా లబ్దిదారుల ఎంపిక జరిగిందన్నారు. బ్యాంక్‌ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా కేవలం స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఎంపికలు జరిగాయన్నారు. కొంతమంది యూనిట్లు పెట్టకుండానే ప్రభుత్వ సబ్సిడీని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిబంధలను తుంగలోకి తొక్కి గతంలో రుణాలు పొందిన వారికే ఈ పర్యాయం కూడా అవకాశం కల్పిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా బ్యాంక్‌ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రభుత్వ సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి నిజమైన లబ్దిదారులకు అవకాశం కల్పించేలా చూడాలని కోరతామన్నారు. విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు, వైస్‌ ఎంపీపీ దొడ్డి వరాహా సత్యనారాయణ, ఎంపీటీసీలు  పెంటకోట అప్పలనాయుడు,పల్లెల ప్రకాశరావు, అరబుపాలెం సర్పంచ్‌ లంబా అప్పారావు, తిమ్మరాజుపేట మాజీ సర్పంచ్‌ శరగడం జగన్నాధరావు, పార్టీ నేతలు బొడ్డేడ శ్రీను, రామరాజు, గుంట్ల అప్పారావు, నమ్మిచిరంజీవి, అల్లవరపు రమణబాబు, క్రరి పెదబ్బాయి  తదితరులు పాల్గొన్నారు.

Back to Top