ఛానెల్స్ ప్ర‌సారాల నిలిపివేత పిరికిపంద చ‌ర్య‌

నక్కపల్లి:   రాష్ట్రంలో వాస్తవ  పరిస్థితులకు అద్దంపడుతున్న ‘సాక్షి’ ప్రసారాలను నిలిపివేయడం పిరిపిపంద చర్య అని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ అన్నారు. ముద్రగడ దీక్ష విరమించే వరకు సాక్షి టీవి ప్రసారాలు నిలిపివేస్తామని మంత్రి చినరాజప్ప ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఏపీ చరిత్రలో ఇలా మీడియా ప్రసారాలను అడ్డుకోవడం  ఎప్పుడూ జరగలేదన్నారు. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఎల్లో మీడియా, పచ్చపత్రికలు వ్యతిరేక వార్తలు రాసినా, ప్రసారాలు చేసినా ఏనాడు ఆయన మీడియాపై ఆంక్షలు విధించలేదన్నారు.
 శనివారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసిల్లో చేరుస్తామంటూ ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందని,  దాన్ని అమలు చేయాలని ముద్రగడ చేస్తున్న దీక్షలో తప్పులేదన్నారు. ముద్రగడను అన్యాయంగా అరెస్టుచేసి ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న ముద్రగడను పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్సార్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ,  అంబటి రాంబాబు, జగ్గిరెడ్డి తదితరులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ కాపులను  చులకనగా చూస్తోందన్నారు. వెఎస్సార్ సీపీ నేతలను అరెస్టు చేయడం, ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ విధించడం వంటి ఆంక్షలను ఉపసంహంచుకోవాలని డిమాండ్ చేశారు. 
Back to Top