సభను నడుపుకోలేక అభాండాలు వేస్తున్నారు

  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దు 
  • గతంలో బాబు తీరుతో డి.స్పీకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు'
  • టీడీపీ సభ్యులు ఏకంగా గవర్నర్ పై దాడికి దిగారు
  • ప్రివిలేజ్ కమిటీని గౌరవించేలా నిర్ణయం ఉండాలి
  • చైర్మన్ కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచన
హైదరాబాద్‌: అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్‌, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైయస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను సజావుగా నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు. సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వారు ప్రివిలేజ్‌ కమిటీ ముందు వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో గతంలో టీడీపీ సభ్యులు ఎలా వ్యవహరించారో తెలియజేశామని, చంద్రబాబు తీరుతో గతంలో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మారావు కన్నీళ్లు పెట్టుకున్నారని, కొంతమంది టీడీపీ సభ్యులైతే గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో పట్టుబట్టినందుకు ప్రివిలేజ్‌ కమిటీ 12 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల మూడు రోజుల సెషన్ లో సంభవించిన సంఘటనల ఆధారంగా ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశాక ఐదు పర్యాయాలు సమావేశం నిర్వహించారని పెద్ది రెడ్డి తెలిపారు. ఇదే చివరి సమావేశం కావొచ్చని పేర్కొన్నారు. సభ్యులపై చర్య తీసుకోవడం మంచి పద్దతి కాదని, నిరంకుశంగా వ్యవహరించినట్టు ఉంటుందని కమిటీ చైర్మన్ కు సూచించినట్టు చెప్పారు. ప్రివిలేజ్ కమిటీ ఉన్నతమైన శాసనసభ వ్యవహారాల కమిటీ కాబట్టి దాన్ని గౌరవించేలా నిర్ణయం ఉండాలన్నారు. చర్యలు తీసుకుంటే అసెంబ్లీలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.  స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రికి అప్పీల్ చేస్తామన్నారు.  

Back to Top