ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదో చీకటి రోజు

ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు...
రౌడీ రాజకీయాలు చేస్తున్నారు
సస్పెన్షన్ అధికారం సభకే ఉంటుందన్నప్పుడు..
కోర్టులో వాదనలు ఎందుకు వినిపించారు
రోజాను ఉరితీయమని సభ తీర్మానిస్తే ఉరి తీసేస్తారా
రాష్ట్ర ప్రజలే టీడీపీకి తగిన బుద్ధి చెబుతారుః రోజా

హైదారాబాద్ః ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను ప్రతి ఒక్కరం గౌరవిస్తామని రోజా తెలిపారు.  కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ..మార్షల్స్ తో సభకు రానీయకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సస్పెన్షన్ చేసే అధికారం సభకే ఉంటుందని చెప్పిన అధికారపార్టీ...కోర్టులో వాదనలు ఎందుకు వినిపించిందని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ కార్యదర్శిని కలిసి వినతిపత్రం ఇచ్చి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 

తప్ప తాగి  చిత్తకార్తె కుక్కలాగా రావెల సుశీల్  వివాహిత మహిళను బలాత్కరించబోయాడు. అలాంటి సుశీల్ తండ్రి మంత్రి రావెలను చంద్రబాబు తొలగించకుండా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అలాంటి మంత్రి సభలో కూర్చునేందుకు అర్హుడా అని రోజా నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిని, ఎస్సైని, ఫారెస్ట్ అధికారులను దారుణంగా కొట్టారు. ఆయనపై రౌడీ షీట్ కూడా ఉంది.  పక్కా ఎవిడెన్స్ ఉన్నా కూడా చింతమనేని అసెంబ్లీలో కూర్చున్నాడు. టీడీపీ ఎమ్మెల్యే బోడెప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కాల్ మనీ సెక్స్ రాకెట్ కు పాల్పడి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడారు. అలాంటి వ్యక్తులు ఇవాళ సభలో కూర్చునేందుకు అర్హులా అని రోజా ప్రశ్నించారు. 

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కుమారుడు సిద్దార్థ్ కార్ రేసులో ఓ వ్యక్తిని గుద్ది చంపినా వారిపై కేసు లేదు. చంద్రబాబు వారిని కేసు నుంచి తప్పించాడు కాబట్టే బోండా ఉమ న్యాయవ్యవస్థ పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడే స్థాయికి దిగజారాడు. బోండా ఉమ చేత రాజీనామా చేయకుండా  బాబు అసెంబ్లీలో కూర్చోబెట్టాడు. తోటి టీచర్ ను టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో కొట్టిన విషయాన్ని అసెంబ్లీలో ఎత్తిచూపాం. ఇలాంటి వ్యక్తులంతా కేసుల్లో ఉన్నా వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్ల వల్ల ఎమ్మెల్యేలకు, ప్రజలకు రక్షణ లేదని...దీనిపై రాష్ట్ర  ప్రజలు ఆలోచన చేయాలన్నారు. 

ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలు రౌడీ రాజకీయాలు, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అనైతిక చర్యలకు పాల్పడిన వాళ్ళని సభలో కూర్చోబెడుతున్న చంద్రబాబు...మహిళా సమస్యలపై పోరాడుతున్న తనను మాత్రం సభకు రానీయమని మాట్లాడడం అహంకారానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ జెండా, అజెండాతో జననేత పేస్ వాల్యుతో గెలిచిన 8మంది పార్టీ ఫిరాయిస్తే.. .వాళ్లను తప్పించాల్సిందిపోయి సస్పెండ్ చేయకుండా  తప్పించుకొని తిరుగుతున్నారని అధికారపార్టీపై నిప్పులు చెరిగారు. 

అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టులకు వెళతాం. తప్పులు జరిగినప్పుడు కోర్టులు వాటిని ఆర్డర్ రూపంలో ఇచ్చినప్పుడు వాటిని పాటించాల్సిన బాధ్యత ఉంది. కానీ, ఏపీ అసెంబ్లీ తీరు భిన్నంగా, న్యాయవ్యవస్థను ధిక్కరించేవిధంగా ఉంది. కోర్టు ఆర్డర్ ను కూడా అసెంబ్లీ కార్యదర్శికి నిన్న ఇచ్చాం. తీసుకొని రిసీవుడ్ కాపీ ఇచ్చారు. ఇవాళ మార్షల్స్ తో సభలోకి రానీయకుండా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం మీద వీళ్లకు ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతోందని రోజా ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పవర్ ఎక్కువుందని మాట్లాడినప్పుడు, కోర్టు చెప్పింది మేము వినమని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలు...కోర్టులో కేసు వేసినప్పుడు న్యాయవాదులను పంపించి ఎందుకు వాదనలు వినిపించారని ప్రశ్నించారు. నెలన్నరగా తాము పోరాడుతుంటే సుప్రీంకోర్టు దాకా ప్రభుత్వం లాయర్లను పంపించి ఎందుకు వాదించిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 


మార్షల్  చీఫ్ గణేష్ బాబు టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే మాదిరి ప్రవర్తించారని చెప్పారు. సస్పెన్షన్ చేసిన రోజు ఓ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనను మార్షల్స్ తో లాగిపడేశారని అన్నారు. రెండు గంటల పాటు అమానీయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాణాపాయ పరిస్థితి తెలుసుకొని తమ అధినేత, ఎమ్మెల్యేలు వచ్చి హాస్పిటల్ లో చేర్పించారన్నారు. హాస్పిటల్ లో ఇన్ పేషెంట్ గా చేర్చుకోవద్దని అప్పుడు కూడా బెదిరించారని చెప్పారు. అదే గణేష్ బాబు ఇవాళ మమ్ముల్ని మళ్లీ అడ్డగించారు. ప్రజలు ఎన్నుకున్న గౌరవసభ్యులం..హైకోర్టు క్లియర్ గా డైరక్షన్ ఇచ్చిందని చెప్పాం. ఐనా కూడా  స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ పంపొద్దాన్నారని చెబుతారు. దానికి సంబంధించి  రిటన్ గా ఇవ్వమంటే తప్పించుకొని తిరుగుతున్నారని రోజా పైరయ్యారు.  

1999లో రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజల తరపున  ఎన్నో సమస్యలపై పోరాడానని రోజా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ .....చిన్న చిన్న విషయాల మీద పోరాడానని చెప్పారు. కానీ, ఏనాడు ఆ మహానేత వాటిని  పోరాటాలుగా  చూశారే గానీ టార్గెట్ చేయలేదన్నారు. కోర్టుల కంటే కూడా అసెంబ్లీయే ఉన్నతమని మాట్లాడుతున్న స్పీకర్.. రేపు రోజాను ఉరి తీయాలి అని సభ తీర్మానిస్తే  ఉరి తీసేస్తారా అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చేయని  తప్పుకు శిక్ష అనుభవించానని రోజా అన్నారు. సభలో ప్రభుత్వం తన నోరు నొక్కేందుకు ప్రయత్నించిందని దుయ్యబట్టారు. మంత్రులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబు బూతులు తిట్టినా స్పీకర్ పట్టించుకోరని మండిపడ్డారు. న్యాయస్థానాన్నికూడా  ధిక్కరించే పరిస్థితికి వస్తే,  జరుగుతున్న అన్యాయంపై ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదన్నారు.  ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద, న్యాయస్థానాల మీద  గౌరవమే లేదన్నారు. నియంతృత్వ పోకడలతో హిట్లర్ పాలనను తలపిస్తూ అహంకారపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అలాంటివాళ్లు చాలామంది మట్టిలో కలిసిపోవడం మనం చూశామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇక తానేంటో రాష్ట్రంలో మహిళలందరికీ తెలుసని రోజా చెప్పారు. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు మీదకు వచ్చి మండుటెండలో ప్రజాసమస్యల మీద పోరాడానని, తన కొడుకు చనిపోయేంత పరిస్థితి వచ్చిందని రోజా వాపోయారు. అలాంటి తాను మహిళల గురించి అగౌరవంగా మాట్లాడానంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించారు కాబట్టి మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు, తన నియోజకవర్గ సమస్యలపై పోరాడుతానని రోజా తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రోజా స్పష్టం చేశారు. 



Back to Top