రోజాకు సుప్రీంకోర్టులో ఊరట

హైదరాబాద్: వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శాసనసభా పక్ష కార్యాలయంలోకి రోజాను అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎల్పీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనవచ్చని పేర్కొంది.  

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోజా అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చారు.  రోజా ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని,  స్పీకర్ కు ఈ లేఖ అందజేయాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. రెగ్యులర్ సెషన్స్ లో లేదా ప్రత్యేక సెషన్స్ లో ఆర్కే రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. శాసన సభ వ్యవహారాలకు కూడా రోజాను అనుమతించాలని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా రోజా వివరణ లేఖపై నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. 

రోజా లేఖపై స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో మరోసారి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను ఆగస్టు తొలివారానికి వాయిదా వేసింది. 

న్యూఢిల్లీ:  కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో మ‌హిళ‌లు అనేక మంది బ‌లైపోతున్నార‌నే ప్ర‌భుత్వంపై పోరాడాను త‌ప్ప‌... ఎవ‌రిపై త‌ప్పుడు, కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాల్‌మనీ విష‌యంలో ప‌త్రిక క‌థ‌నాల్లో వ‌చ్చిన ప‌దాల‌ను మాత్ర‌మే వాడాను త‌ప్ప వ్య‌క్తిగతంగా ఒక్క‌ప‌దం కూడా కొత్త‌గా వాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న వ్యాఖ్య‌ల‌కు ఎవ‌రైనా బాధ‌ప‌డివుంటే ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటాన‌న్నారు. ప్రివిలెజ్ క‌మిటీ స‌భ్యుల్లో ఏడుగురు ఉంటే దాంట్లో ఐదుగురు అధికార పార్టీకి చెందిన వారు, ఇద్ద‌రు మాత్రమే ప్ర‌తిప‌క్ష స‌భ్యులను చేర్చార‌న్నారు. 

అసెంబ్లీ సాక్షిగా టీడీపీ శాస‌న‌స‌భ్యులు బొండా ఉమా, దేవినేని, అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి...పాతేస్తాం, న‌లిపేస్తాం, మ‌గ‌త‌నం ఉందా, ఖ‌బ‌డ్దార్ అని మాట్లాడినా వారిపై ప్ర‌తిప‌క్షం ఇచ్చిన ప్రివిలెజ్ మోష‌న్ వెలుగు చూడ‌కుండా పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌క్ష‌పాతం లేకుండా న్యాయం జ‌రిగితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగితే ప్ర‌తిప‌క్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తోంద‌ని లేఖ‌లో పేర్కొన్నామ‌న్నారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో త‌న‌ను ఎవ‌రైనా అడ్డుకుంటే సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తామ‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింద‌ని రోజా వివ‌రించారు. ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాల‌తో త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. 


Back to Top