ప్రజల్లో తేల్చుకుందాం రా

అబద్ధాలు చెప్పడం, మోసం చేయడమే బాబు నైజం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు 
అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని బాబు భయం
అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజానాలు తాకట్టు పెట్టాడు
దమ్మూ, ధైర్యం ఉంటే కొనుక్కున్నఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
అప్పుడే అయిపోలేదు..అసలు పోరు ఇప్పుడే మొదలైంది
అందరం కలిసికట్టుగా రైల్వో జోన్ కోసం ఉద్యమిద్దాంః వైఎస్ జగన్

విశాఖపట్నంః చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసిన పాపాన పోవడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పడం..అయిపోయాక ప్రజలను మోసం చేయడమే బాబుకున్న విశ్వనీయత అని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని...బాబును రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. బాబు పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారు గనుకే ఇవాళ రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో గుడివాడ అమర్నాథ్ ను పరామర్శించిన జననేత నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని, లేనిపక్షంలో దీక్ష చేస్తానని అమర్ నెలరోజుల ముందే చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలంటూ ముఖ్యమంత్రికి, ప్రధానికి సైతం లేఖ రాశారని పేర్కొన్నారు. ఎటువంటి స్పందన లేకపోవడం వల్లే బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున అమర్నాథ్ దీక్షకు కూర్చున్నారని వైఎస్ జగన్ చెప్పారు. 

బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. బాబు ఇచ్చిన రుణాలు రైతులకు వడ్డీలకు కూడా సరిపోలేదు. డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. రుణాల మాఫీ దేవుడెరుగు. రూ. 2 వడ్డీలు కట్టే దుస్థితికి తీసుకొచ్చాడు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ ఫోజులు కొట్టాడు. బాబుకయితే ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది గానీ...రాష్ర్టంలో ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు. పైపెచ్చు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి...ఇప్పుడు దానిపై మాట తప్పుతున్నారు.  కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ అన్నాడు. దాని ఊసేలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్నెళ్ల వరకు జీతాలు చెల్లించడం లేదు. ఇలా ప్రతి ఒక్కరినీ బాబు మోసం చేస్తున్నారని  వైఎస్ జగన్ మండిపడ్డారు.  

ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభించేవన్నారు. ఆ హోదాను కూడా చంద్రబాబు కేంద్రం వద్ద పణంగా పెట్టాడని, దాని గురించి అడిగే నాథుడే కరువయ్యాడన్నారు. వైఎస్సార్సీపీ తరపున తాము అడుగుతున్నాం కాబట్టే ఇవాళ హోదా బతికుందని జననేత స్పష్టం చేశారు. లేకపోతే అడిగేవాడే లేడన్నారు.  హోదా మాదిరే విశాఖకు రైల్వే జోన్ వస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రైల్వే జోన్ లేని కారణంగానే ఉద్యోగాల కోసం ఒరిస్సాకు వెళుతున్న ఏపీ నిరుద్యోగులను అక్కడివాళ్లు తరిమికొట్టే పరిస్థితి వచ్చిందని వాపోయారు. 

సికింద్రాబాద్ రైల్వే జోన్ తెలంగాణకు వెళ్లిపోయింది.  ఏపీకి రావాల్సిన రైల్వే జోన్ ఒరిస్సాకు వెళ్లిపోయింది. ఉద్యోగాల కోసం ఒరిస్సాకు వెళుతున్న ఏపీలోని యువకులు అక్కడ తలెత్తుకొని పరీక్షలు రాయలేని పరిస్థితి.  విశాఖకు రైల్వే జోన్ వస్తే 16 హెచ్ వోడిలు వస్తాయి. కొత్త రైళ్లు, లైన్లు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మెరగువుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా తీసుకురారు. ఉద్యోగాలు ఇవ్వరు. బాబును ఒక్కటే  సూటిగా అడుగుతున్నా. అధికారంలోకి వచ్చి రెండేళ్లయిపోయింది. మీరు ఏం చేస్తా ఉన్నారు.  ప్రత్యేకహోదా , రైల్వే జోన్, పోలవరానికి సంబంధించిన వనరులు సహా ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని వైఎస్ జగన్ బాబును కడిగే పారేశారు. కేంద్రంలో ఇంకా మీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియా, వీడియో టేపులతో అఢ్డంగా దొరికిపోయిన కేసులో, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసిన దానిపై  విచారణ జరుగుతుందనే...చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద పణంగా పెట్టాడని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు తన పాలన గురించి గొప్పగా డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరమని వైఎస్ జగన్ తూర్పారబట్టారు.  చంద్రబాబు నిన్ను  ప్రజలు ఏవిధంగా వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలంటే... దమ్మూ, ధైర్యం ఉంటే అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి రా. జనంలోకి వెళ్దాం. నీకు ఓట్లు వేస్తారో, నాకు వేస్తారో తేల్చుకుందామంటూ బాబుకు సవాల్ విసిరారు. ఆ ఎమ్మెల్యేలను గెలిపించి తీసుకొస్తానన్న నమ్మకం కూడా బాబుకు లేదని జననేత ఎద్దేవా చేశారు. 

దీక్షా శిబిరంపై రాత్రి 11 గంటలప్పుడు దాడి చేసి...బలవంతంగా  దీక్షను భగ్నం చేస్తూ అమర్నాథ్ ను ఏవిధంగా ఆస్పత్రికి తరలించారో అంతా చూశాం. ఈ ఉద్యమం ఇంతటితో అయిపోలేదని, అసలు పోరాటం ఇప్పుడే మొదలైందన్న విషయం  బాబు గుర్తుంచుకోవాలన్నారు. అందరం కలిసికట్టుగా పోరాడుదామని రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అందుకోసం అందరి సహయసహకారాలు వైఎస్సార్సీపీకి కావాలన్నారు. రాబోయే కాలంలో రైల్వే జోన్ కోసం ఐక్యంగా గట్టిగా ఉద్యమిద్దామన్నారు. అమర్నాథ్ దీక్షకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అమర్ దీక్షను చూసైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. లేకుంటే దేవుడు, ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని జననేత హెచ్చరించారు. 

Back to Top