నిరుద్యోగుల‌కు బాబు ల‌క్షా 8వేల కోట్లు బ‌కాయి

హైద‌రాబాద్‌: చ‌ంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెర‌వేర్చ‌క‌పోగా అప్పుడు అలా అన‌లేదు.. అప్పుడు అలా చెప్ప‌లేదు అంటూ అప‌ద్ధ‌పు మాట‌లు మాట్లాడుతున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆదివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో భూమ‌న బాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పార‌ని, బాబు అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికి 31 నెల‌లు అవుతున్నా ఏ ఒక్క‌రికి ఉద్యోగం ఇవ్వ‌లేద‌న్నారు. టీడీపీ లెక్క‌ల ప్ర‌కారమే రాష్ట్రంలో కోటి 75 ల‌క్ష‌ల ఇళ్లు ఉన్నాయ‌ని ఇంటికి ఒక‌రికి చొప్పున  ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో నిరుద్యోగికి రూ.62 వేల ప్ర‌కారం నిరుద్యోగుల‌కు ల‌క్షా 8 వేల కోట్లు బాబు బ‌కాయి ప‌డ్డార‌న్నారు. 1994లో ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్న త‌ర్వాత సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేదం  చ‌స్తామ‌ని, ఒక హార్స్‌ప‌వ‌ర్‌కు రూ.50లు మాత్ర‌మే వ‌సూలు చేస్తామ‌ని, కిలో రూ.2ల‌కే బియ్యం ఇస్తామ‌ని చెప్పి నాడు మోసం చేసిన చంద్ర‌బాబు ఇప్ప‌టికీ అదే ప‌ద్ధ‌తిని కొన‌సాగిస్తున్నార‌న్నారు.  ఇంటికో ఉద్యోగంతో పాటు ఎల్‌కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచిత విద్య‌నందిస్తాన‌న్న చంద్ర‌బాబు నేటి వ‌ర‌కు ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోనే లేద‌న్నారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీలు కానీ.. మేనిఫెస్టో కానీ ఎక్క‌డా దొర‌క్క‌కుండా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌ల‌ను సైతం యూటూబ్‌లో లేకుండా డిలిట్ చేశార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను తొలగించారన్నారు. 'మీరిచ్చిన వాగ్దానాలు, ప్రకటనలు టీడీపీ కార్యాలయానికి పంపుతాం.. చదివి సిగ్గుతో తలదించుకోండి' అని భూమన ధ్వజమెత్తారు.
Back to Top