దురదృష్టకరమైతే ఎందుకు వేలాడుతున్నట్లు?

హైదరాబాద్ :

‘రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చిస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం అని దొంగ ఏడుపులు ఏడుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిని పట్టుకుని ఇంకా ఎందుకు వేలాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర పట్ల కిరణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆయన ఏనాడో తన పదవికి రాజీనామా చేసేవారన్నారు. ఢిల్లీ పెద్దల స్క్రిప్టులో భాగంగానే రాష్ట్ర ప్రజలను కిరణ్ మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సహచర పార్టీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, టి.బాలరాజు, కె.శ్రీనివాసులు, కాటసాని రామిరెడ్డి, బి.గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలతో కలిసి ఆయన బుధవారం అసెంబ్లీ వద్ద మాట్లాడారు.

‌రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తాము సూచించిన విధంగా అందరూ ఆనాడే రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించి ఉంటే రాష్ట్రానికి విభజన బిల్లు వచ్చేదా? అని భూమన సూటిగా ప్రశ్నించారు. పైలీన్ తుపా‌న్‌ను ఆపలేకపోయాను కానీ, విభజన బిల్లును ఆపుతానని చెప్పిన కిరణ్ ఇప్పుడు అసెంబ్లీలో కుట్ర‌పూరితంగా వ్యవహరిస్తున్నారని, తద్వారా విభజనకు సహకరిస్తున్నారని భూమన ఆరోపించారు. పైగా సీఎంగా ఉండటం దురదృష్టకరమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం, సోనియా నిర్ణయాలకు గంగిరెద్దులా తలూపి వచ్చి సభలో సమైక్యవాదిని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని భూమన విమర్శించారు. సమైక్య తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తే బిల్లు సభకు వస్తుందని, అప్పుడు తీర్మానం చేద్దామని, బిల్లును సభలో ఓడిస్తామని ప్రగల్భాలు పలికారని సీఎం‌ కిరణ్‌పై విరుచుకుపడ్డారు.

బిల్లును రాష్ట్రపతికి త్వరగా పంపించేయాలనే ఉద్దేశంతో ఓటింగ్ కూడా జరపకుండా చేసేందుకు కుట్ర జరుగుతోంద‌ని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ‌ఆ క్రమంలోనే ఓటింగ్‌ ఉండదంటూ మంత్రి జానారెడ్డితో మాట్లాడించారని ఆయన ఆరోపించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top