గంగవరం పోర్టుకు 1800 ఎకరాలెందుకు?

పోర్టు అధికారుల తీరుపై మండిపడిన పీఏసీ చైర్మన్ భూమా
విశాఖ జిల్లాలో పీఏసీ పర్యటన

విశాఖపట్నం: ‘గంగవరం పోర్టు కోసం 1800 ఎకరాలు తీసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వానికీ ఏమైనా ఉపయోగం ఉందా? అసలు అంత భూమి ఈ పోర్టుకు అవసరం ఉందా? ఇచ్చిన భూముల్లో ఎంత ఉపయోగిస్తున్నారు? ఇంకా ఎంత ఖాళీగా ఉంది. గంగవరం పోర్టు వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేవీ? ఒప్పందం ప్రకారం నిర్వాసితులకు ఎందుకు ఉద్యోగాలివ్వలేకపోతున్నారు?’ అంటూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి పోర్టు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో పోర్టు అధికారులు చెప్పిన సమాధానాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదికను పీఏసీకి సమర్పించాలని ఆదేశించారు.  విశాఖ జిల్లాలో పీఏసీ పర్యటించింది. తొలుత జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో కలిసి జిల్లాలో అమలవుతున్న పర్యాటక ప్రాజెక్టులు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై రుషికొండలో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ... భీమిలి డివిజన్ తొట్ల కొండలో మంజూరైన పర్యాటక ప్రాజెక్టులు, కార్యరూపం దాల్చకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖకు ఎన్నో పర్యాటక ప్రాజెక్టులు మంజూరవుతున్నప్పటికీ పర్యవేక్షణ సరిగా లేక కార్యరూపం దాల్చడంలో జాప్యం జరుగుతోందని కలెక్టర్ కమిటీకి వివరించారు. ప్రాజెక్టుల పర్యవేక్షణను ఉడాకు అప్పగిస్తే బాగుంటుందన్నారు. దీనిపై పీఏసీ చైర్మన్ భూమా మాట్లాడుతూ ... పర్యవేక్షణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని, వాటిని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కలెక్టర్‌కు చెప్పారు. అనంతరం కమిటీ సభ్యులు రుషికొండ వద్ద బే పార్కు హోటల్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.

తాజా వీడియోలు

Back to Top