బాబు వల్లే రాష్ట్ర విభజన: భూమా

హైదరాబాద్ 01 ఆగస్టు 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్రానికి ఏర్పడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి స్పష్టంచేశారు. కర్నూలులో గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ రాజకీయాలను చాలించాలని ఆయన కోరారు. వీరి రాజకీయాల కారణంగా రాష్ట్రం, ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలని ఉద్యమాలు చేస్తుంటే, కాంగ్రెస్ మంత్రులు కొందరు రాజీనామాలు చేస్తున్నామనీ, కొందరు చేయమనీ చెబుతున్నారనీ ఇలాంటి వైఖరి తగదనీ ఆయన హితవు పలికారు. ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సింది కాంగ్రెస్ మంత్రులే కదా అని ప్రశ్నించారు. పార్టీకి మీరెందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. రాష్ట్ర విభజన అంశమై తెలుగుదేశం పార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. గతంలో చంద్రబాబు లేఖ ఇచ్చిన కారణంగానే ఈ విభజన జరిగిందని స్పష్టంచేశారు. సమస్యలుంటే పరిష్కరించి, ఆచరణలోకి వెళ్ళాలి కానీ ప్రస్తుతం కేంద్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. శ్రీశైలం డ్యామ్ డెడ్ స్టోరేజికి వెడితే రాయలసీమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించిన తర్వాత విభజన జరిగుంటే బాగుండేది... ఆ సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి ఉండాల్సింది.. అలా కాకుండా విభజించి కమిటీ వేస్తామనడం ఎంతవరకూ సమంజసమని భూమన అడిగారు.  తెలంగాణ బిల్లు ఆమోదానికి చాలా ప్రక్రియ ఉందని కేంద్రం చెప్పిందనీ, దాన్ని ఆపేందుకు ఏం చేయాలనే అంశం ప్రస్తుతం మన ముందున్న సమస్యని చెప్పారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే తరవాత మన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించాలన్నారు. సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడటం మాని రాజధాని గురించి ఆందోళన చెందడమేమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిలా కనిపించిందన్నారు. ఆయన మాటలో ఎక్కడా డిమాండ్ కనిపించలేదన్నారు. ఆయన మాట్లాడిన తీరు విభజన జరిగిపోయినట్లుందన్నారు. ఈ పాపం ఊరికే పోదని చంద్రబాబును హెచ్చరించారు.

కేంద్రంలో ఉన్నది మాఫియా ప్రభుత్వం

ప్రస్తుతం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నట్లు లేదనీ, మాఫియా ప్రభుత్వమున్నట్లుందనీ భూమా తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమను అడిగేవారు ఎవరూ లేరనే ఉద్దేశంలో కేంద్రం ఉందన్నారు. ప్రజా ప్రతినిధులందరినీ కేంద్రం సీబీఐ బూచిని చూపి భయపెట్టిందని ఆరోపించారు. ఇటువంటి ధోరణినిన ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సోనియా గాంధీ రెండు సార్లు కేంద్రంలో అధికారం అనుభవించడానికి కారణం రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్షేనని చెప్పారు. లబ్ధిపొందడానికి కారకులైన ప్రజలనే సోనియా చిత్రహింసలు పెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీని ఒక్క సీటు కూడా రాకుండా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయాలను విడిచి, సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు చేతులు జోడించి కోరుతున్నానన్నారు.

తాజా ఫోటోలు

Back to Top