బాధిత రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి..!

విజయనగరంః ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్ పోర్ట్ బాధత రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఉన్న సెంట్, రెండు సెంట్ల భూమితో పాటు ఇళ్లు లాక్కుంటున్నారని గూడెపువలస, కవులవాడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు వైఎస్ జగన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఎవరూ భయపడొద్దని అండగా ఉంటామని ఈసందర్భంగా జగన్ బాధితుల్లో ధైర్యం నింపారు.  

రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి..

నర్సాయమ్మ..(గూడెపువలస)
సార్ మాకు రెండెకరాలు ఉంది. ఈభూమే మాకు జీవనాధారం. ఇది కూడా తీసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ తమకు వద్దే వద్దని అన్నారు. మా ప్రాణాలైనా ఇస్తాం కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ భూములివ్వమని అన్నారు. మా ఊరిమీద పడి భూములు లాక్కుంటుంటే భయమేస్తోందని వాపోయారు.
వైఎస్ జగన్
విశాఖపట్నంలో ఎయిర్ పోర్టు ఉన్నా ఇక్కడే భూములు ఎందుకు తీసుకుంటున్నారని వైఎస్ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. బాంబే,తమిళనాడు, కేరళ సహా ఎక్కడా వేయి, 1200 ఎకరాలకు మించి ఎయిర్ పోర్ట్ లేదని...రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు పేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. విమానాల మంత్రి అశోకగజపతి రాజు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ పక్కన పడేశారు. అయ్యన్నపాత్రుడు, గంటా, అవంతి శ్రీనివాస్ లకు లబ్ది చేకూర్చేందుకు 15 వేల ఎకరాలు లాక్కోవాలని ప్లాన్ వేశారని వైఎస్ జగన్ అన్నారు. అన్నగా కచ్చితంగా పోరాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

కె. బుజ్జి (గూడెపువలస)
మాకు ఇక్కడ రెండు ఎకరాల భూమి ఉంది. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. భూములిచ్చేస్తే మేం కూలీలుగా మారిపోతాం. వందలాది ఎకరాలున్నమీ పార్టీ నాయకుల భూములు మీకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. విమానాలు మా భూములమీదే ఎగురుతాయా, వేరే చోట విమానాలు ఎగరవా అని నిలదీశారు.  మా భూములు లాక్కుని... మీరు వేసే ముష్టి మాకెందుకు. భూములు విషయంలో గత నెలరోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా పోయింది మాకు అని ఆవేదన చెందారు.
వైఎస్ జగన్ 
చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు పోగొడుతున్నాడు. చంద్రబాబు జీవితమంతా మోసాలు, అబద్ధాలు, దౌర్జన్యాలే. 

మణి..(గూడెపువలస)
ఎన్నెకరాలుంది తల్లి.  3 ఎకరాలు ఉంది సార్. పొలం చూసుకుంటాం అదే బతుకుదెరువు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వస్తారు. నెల నుంచి నిరహార దీక్ష చేస్తుంటే ఒక్కనాయకుడు రాలేదు. భూములు పోతున్నాయని భయమేస్తోంది. ఎర్రబస్సే లేని మాఊళ్లో విమానం ఎందుకు .చంద్రబాబు నీవు నీకొడుకు తప్ప ఇక్కడ ఎవరూ విమానం ఎక్కరు .
వైఎస్ జగన్..
భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు. అడిగినవాళ్లపై పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. మగవాళ్లు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే ఆడవాళ్లు దీక్షలు చేస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, బ్రిటీష్ వాళ్ల పరిపాలనలో ఉన్నామా అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు జగన్. 

గౌరీ..
మాకు  ఇళ్లు మాత్రమే ఉంది. అది కూడా లాక్కుంటున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ,108 లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. కానీ చంద్రబాబు అందరినీ క్షోభకు గురిచేస్తున్నాడు. భూములు కోల్పోతామన్న భయంతో గుండెపోటు , ఆత్మహత్యలు చేసుకొని మావాళ్లు చనిపోతున్నారని గౌరీ కన్నీటిపర్యంతమయ్యారు.
వైఎస్ జగన్...
ఇంటికో జాబు ఇస్తాననని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  ఉన్న జాబులను తీస్తున్నాడని జగన్ ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ భృతి కూడా ఇవ్వడం లేదు సరికదా ఇళ్లు, పొలం కూడా లాక్కుంటున్నాడని విమర్శించారు. ప్రజలకు ఆమోదయోగం కాని నిర్ణయాలు ఇకనైనా మానుకోవాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు.

మట్టిస్వామి..
ఎక్కడి నుంచో వచ్చిన కిమిడి మృణాళిని గెలిపించాం. ఆమెని నమ్మి మేం మోసపోయాం. ఇక్కడ భూములు దోచుకొని చంద్రబాబు సింగపూరోళ్లకు అప్పజెప్పుతున్నాడు.
వైఎస్ జగన్ ..
విదేశీయులను రప్పించి వాళ్లకే భూములిచ్చే దౌర్భాగ్య పరిస్థితులలో రాష్ట్రం ఉండడం దారుణం. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు ఇక్కడకొచ్చి భూములు లాక్కుంటున్నారని బాధితులు చెబుతున్నారు.  ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు.

వంశీరెడ్డి(రెడ్డి కంచేరు)
మాకు 3 ఎకరాలు ఉంది. బడ్డి షాప్ పెట్టుకొని బతుకుతున్నాం. నిజంగా విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవాలంటే గాల్లోనే కట్టుకోవాలి. వేరుశనగ,మొక్కజొన్న వేసుకొని బతుకుతున్న పేదవాళ్ల భూములు లాక్కొని ఇంతదుర్మార్గానికి  పాల్పడతారా.
వైఎస్ జగన్..
ఇంతమంది ఉసురు పోసుకొని బలవంతంగా భూములు లాక్కుంటే చంద్రబాబుకు పుట్టగతులుండవు. ఎయిర్ పోర్ట్ షిఫ్ట్ చేసి పేదల భూములు లాక్కోవడం మంచిది కాదు. గట్టిగా నిలబడదాం. కోర్టులో కేసులు వేసైనా ఆపే కార్యక్రమం చేద్దాం.  అధికార బలంతో భూములు లాక్కుంటే బంగాళఖాతంలో కలవడం ఖాయం. మళ్లీ మళ్లీ భోగాపురం వస్తాను. మీతోపాటు ఇదే వేదికపై దీక్ష చేస్తాను. భూములు కోల్పోతామన్న భయంతో చనిపోయిన కుటుంబాలకు  పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 
Back to Top