రూప కుటుంబానికి న్యాయం చేయండి

తగరపువలస (విశాఖ‌): గత నెల 19న భీమిలి మండలం టి.నగరపాలెంలో ప్రేమోన్మాది హరిసంతోష్‌ చేతిలో బలయిపోయిన పొట్నూరు రుక్మిణి(రూప) కుటుంబానికి న్యాయం చేయాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె రూప కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని హరిసంతోష్, రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడని తాతయ్య ఎల్లయ్య, నాన్నమ్మ అప్పచ్చమ్మలు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న రూప తమ్ముడు ఉపేంద్ర కూడా బలయిపోయాడన్నారు. ఎవరెవరు ఇంట్లో ఉన్నారు వంటి విషయాలు నిందితునికి తెలిపేందుకు స్థానికంగా కొందరు యువకులు సహకరించి ఉంటారని వృద్ధ దంపతులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు కిరోసిన్‌ పోసి అంటించేటప్పుడు స్థానికంగా ఒక యువకుడే బయట తలుపు గడియ పెట్టినట్టు ఉపేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడన్నారు. తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని మనుమరాలు రూప, మనుమడు ఉపేంద్రలను హతమార్చడంలో నిందితుడు హరి సంతోష్‌కు సహకరించిన వ్యక్తులను విచారించి శిక్షించాలన్నారు. తమకు ఇంత కష్టం వచ్చినా ప్రజాప్రతినిధులెవరూ ఇప్పటి వరకు ధైర్యం చెప్పలేదని రూపు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అక్కరమాని విజయనిర్మల మాట్లాడుతూ నిందితుని వెనుక ఉన్నవారిని తెలుసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బుదవారం నగర పోలీస్‌కమిషనర్‌ యోగానంద్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. రూప కుటుంబాన్ని పరామర్శించిన వారిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి దాట్ల వెంకట అప్పల ప్రసాదరాజు(పెదబాబు), భీమిలి పట్టణ అధ్యక్ష,కార్యదర్శులు అక్కరమాని వెంకటరావు, జీరు వెంకటరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top