భవితపై ధీమా.. రైతన్నకు భరోసా

ఉరవకొండ:

నీలం తుపాను ప్రభావం వల్ల మూడో రోజూ వాన కురిస్తే.. జనం ఆ వానతో పోటీపడుతూ కదం తొక్కారు. మహానేత వైఎస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిలకు జోరు వానలోనూ బ్రహ్మరథం పట్టారు. జడివానలోనూ తన అడుగులో అడుగు వేస్తూ కదంతొక్కుతున్న జనాన్ని చూసి షర్మిల పులకించిపోయారు. పండుటాకులను ఆత్మీయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు ఓపికతో సావధానంగా వింటూ.. మహిళలతో మమేకమవుతూ.. విద్యార్థులకు భవిష్యత్తుపై ధీమానూ... రైతన్నకు ఆత్మస్థైర్యాన్నీ  కల్పిస్తూ షర్మిల ముందుకు సాగారు. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు జిల్లాలో 11వ రోజు పాదయాత్రకు ఉపక్రమించారు. భంభంస్వామి గుట్ట నుంచి 205 జాతీయ రహదారి మీదుగా నడుస్తూ.. హెచ్చెల్సీ-మిడ్ పెన్నార్ లింక్ కెనాల్ వద్దకు షర్మిల చేరుకున్నారు.

పరిస్థితులపై రైతులతో ఆరా
      అక్కడ రైతులతో  పరిస్థితులపై ఆరా తీశారు. ‘అమ్మా.. ఎంపీఆర్ ఆయకట్టుకు ఖరీఫ్‌లోనే నీళ్లివ్వాల్సింది. కానీ.. ఇప్పుడు రబీలో ఇస్తున్నారు. హెచ్చెల్సీ కోటా డిసెంబర్ మొదటి వారంతోనే పూర్తి కానుంది. జనవరి 15 వరకు రబీకి నీళ్లిస్తామంటున్నారు. 75 రోజులు నీళ్లిస్తే ఏం పంట పండించుకోవాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘జిల్లా పరిస్థితులను గమనించే మహానేత వైఎస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీల నీళ్లు కేటాయించారు. హెచ్చెల్సీకి కేటాయించిన నీటిని ఖరీఫ్‌లోనే రప్పించుకునేలా చేసి ఆయకట్టుకు నీళ్లందించేవారు. పీఏబీఆర్‌కు కేటాయించిన నీటిని తాగునీటి కోసం, చెరువులకు నీళ్లు నింపడం కోసం వినియోగించేవారు. అప్పుడు ఇబ్బంది ఉండేది కాదు. పీఏబీఆర్‌కు నీటి కోటాను ఈ ప్రభుత్వం రద్దు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జగనన్న సీఎం అయ్యాక టీబీ డ్యామ్ నుంచి సమాంతర కాలువ తవ్వించడానికి పోరాటం చేస్తాం.. తద్వారా వరద వచ్చినప్పుడు ఆ నీటిని జిల్లాకు మళ్లించి సస్యశ్యామలం చేస్తాం’ అంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత పెన్నఅహోబిలం చేరుకున్న షర్మిల అక్కడ రోడ్డు పక్కన ఉన్న గుట్టపై ఉన్న బండపై  కూర్చొని ప్రజలతో రచ్చబండ నిర్వహించారు.

వంద రోజుల ఉపాధి అని 30 రోజులే పని కల్పిస్తున్నారు..
     ‘అమ్మా.. వర్షాభావం వల్ల ఎలాంటి సేద్యపు పనులు లేవు. ఉపాధి హామీ పథకం కింద వంద రోజులు పని కల్పిస్తామని చెప్పి.. కేవలం 20 నుంచి 30 రోజులే పని కల్పిస్తున్నారు. రోజు వారి కూలీ రూ.60 కూడా గిట్టుబాటు కావడం లేదు. అదే వైయస్ ఉన్నప్పుడు ఏడాదికి వంద రోజులు పని కల్పించేవారు. రోజు వారీ కూలీ రూ.100 నుంచి రూ.120 వరకు గిట్టుబాటయ్యేది. అప్పుడు కూలీ కూడా ఎప్పటికప్పుడు చెల్లించేవారు. కానీ.. ఇప్పుడు సక్రమంగా చెల్లించడం లేదు’ అని మోపిడికి చెందిన ఓ మహిళ షర్మిలకు విన్నవించుకుంది. రాకెట్లకు చెందిన ఓ వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘అమ్మా నాకు ఇప్పుడు పెన్షన్ రావడం లేదు.

కిరణ్ మొద్దునిద్రకు సమస్యలే సాక్ష్యం: షర్మిల

     వైయస్ ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.200 చొప్పున వచ్చేది.. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథులే లేరు’ అంటూ షర్మిలకు తన బాధను చెప్పుకుంది. ‘అమ్మా.. మాకు కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. సాగునీళ్లు దేవుడెరుగు.. తాగునీళ్లే లేవు’ అంటూ మోపిడికి చెందిన మరో మహిళ విలపించింది. ఇందుకు షర్మిల స్పం దిస్తూ.. ‘సీఎం కిరణ్ మొద్దునిద్ర పోతున్నారనడానికి మీ సమస్యలే నిదర్శనం. వైయస్ రెక్కల కష్టంపై అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయనను గౌరవించేలా ఏ ఒక్క పని చేయడం లేదు. సర్‌చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు మోతెక్కిస్తున్నారు. అన్ని చార్జీలు పెంచి.. దగా చేస్తున్నారు.

చంద్రబాబు డ్రామాలు   

     ప్రజావంచక ప్రభుత్వాన్ని గద్దెదింపకుండా.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టకుండా పాదయాత్ర అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి.. ప్రతి పక్షానికి తగిన రీతిలో బుద్ధిచెప్పండి.. రాజన్న రాజ్యం వస్తుంది. సేద్యానికి ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్‌ను జగనన్న ఇస్తారు. వికలాంగులకు రూ.వెయ్యి, వృద్ధులకు రూ.700 చొప్పున పెన్షన్ ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద పదో తరగతి వరకు చదవుకునే పిల్లలకు రూ.500 చొప్పున, ఇంటర్ వరకు రూ.700, డిగ్రీ వరకు రూ.వెయ్యి చొప్పున వారి తల్లుల అకౌంట్లలో ప్రతి నెలా జమా చేస్తారు. వైయస్ చేపట్టిన ప్రతి పథకాన్ని అమలుచేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కంది చేనులోకి వెళ్లారు. ఆ పొలంలో ఉన్న రైతు లక్ష్మిదేవిని సమస్యలపై ఆరా తీశారు.

నడవడానికి వీలుకాని దారిలోనూ..
     కోనాపురం క్రాస్ వద్ద భోజనం చేసి కాసేపు విరామం తీసుకున్న షర్మిల జోరు వానలో మధ్యాహ్నం 3.10 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. కోనాపురం క్రాస్ నుంచి కోనాపురం చేరుకునే దారి వర్షం వల్ల నడవడానికి కూడా వీలు లేకుండా బురదమయంగా మారిపోయింది. ఆ దారిలోనే షర్మిల వడివడిగా నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కోనాపురం చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు జోరువానలోనూ నీరాజనాలు పలికారు.

    ఆ గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించిన షర్మిల అక్కడి నుంచి బురదమయంగా మారిన దారి గుండా షేక్షానుపల్లికి చేరుకున్నారు. షేక్షానుపల్లికి చేరుకునే క్రమంలోనే వర్షం జోరు పెరిగింది. వర్షంలో తడుస్తూనే షేక్షానుపల్లికి చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.   వర్షంలోనూ తన కోసం వేచి చూస్తున్నందుకు మీ అభిమానాన్ని మరువలేమని అన్నారు. ‘ఈ రోడ్లను చూస్తుంటే మీ కష్టాలు నాకు అర్థమవుతున్నాయి.. జగనన్న సీఎం అవగానే మీ గ్రామాలకు రోడ్లు వేయించి.. బస్సులు నడిచేలా చూస్తాం’ అంటూ హామీ ఇవ్వడంతో షేక్షానుపల్లి ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు.ఆ గ్రామ ప్రజల నుంచి వీడ్కోలు తీసుకున్న అనంతరం లత్తవరం శివారుకు 5.40 గంటలకు చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. శుక్రవారం పాదయాత్రలో 12.5 కిలోమీటర్ల మేర నడిచారు.

Back to Top