భవిష్యత్తు మనదే : విజయమ్మ భరోసా

హైదరాబాద్, 20 ఫిబ్రవరి 2013: భవిష్యత్తు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అని పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ ‌ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోందని ఆమె మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలపైనా భారాలు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయమ్మ ‌పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఈ సమావేశం జరిగింది. సమావేశానికి శ్రీమతి విజయమ్మ అధ్యక్షత వహించారు.

అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబే ప్రభుత్వాన్ని కాపాడటం దారుణం అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆయన నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు. తన బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోగా చంద్రబాబు నాయుడు వైయస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ‌ఆమె వ్యాఖ్యానించారు. పార్టీపై అడ్డగోలుగా కొందరు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే బాధ్యత కార్యకర్తలదే అన్నారు. ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు దివాలా తీయించారని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. ఐఎంజి, ఎమ్మార్‌, రహేజా సంస్థలకు వేలాది కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. బాబు పెట్టిన బాధల కారణంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను కనీసం పరామర్శించే మనసు కూడా చంద్రబాబు లేదని అన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు రుణమాఫీ అంటూ కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కలిసికట్టుగా పార్టీని పటిష్టం చేద్దాం: 
పార్టీ అధ్యక్షుడు జగన్‌బాబును 9 నెలల నుంచి జైలులో పెట్టి, ప్రజల నుంచి దూరం చేసినా అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేద్దామని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంలో ఏ మాత్రం వెనకబడకూడదని పార్టీ నాయకులకు సూచించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం జరగాలన్నారు. పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును పునరుద్ధరించాలని ఆమె సూచించారు. సభ్యత్వ నమోదును ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వైయస్‌ఆర్‌సిపి ప్రజల పార్టీ, పేదల పార్టీ అని నిరూపించుకోవాల్సిన అవసరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి పైనా ఉందని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రజలతో మనందరం మమేకం అవుదామని ఆమె సూచించారు.

పార్టీ పటిష్టత కోసం తాను త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని, అన్ని విషయాలపైనా సమీక్షలు నిర్వహిస్తానని శ్రీమతి విజయ్మ ప్రకటించారు. మార్చి రెండవ వారంలో జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పార్టీ గౌరవ అధ్యక్షురాలు స్పష్టం చేశారు.

అనిల్‌ మీద ఆరోపణలు చేస్తున్న వారిపై పరువునష్టం దావా : 
కాగా, బ్రదర్‌ అనిల్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు సహా అందరిపైనా న్యాయపోరాటం చేస్తామని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా తెలిపారు. రక్షణ స్టీల్‌కు అనిల్‌తో సంబంధం లేదన్నారు. అగస్టా హెలికాప్టర్ కుంభకోణంలో కూడా అనిల్‌ ఉన్నారని మాట్లాడుతుండడమేమిటని ఖండించారు. ప్రార్ధనా మందిరం కోసం మణికొండలో నాలుగు ఎకరాలు ఇస్తే అది కూడా అనిల్‌దే అంటున్నారని శ్రీమతి విజయమ్మ అన్నారు. దేవుని సేవ తప్ప అనిల్‌కు ఏమీ తెలియదని వివరించారు. అనిల్‌పైన వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ పరమైనవే అన్నారు. మహానేత వైయస్‌ మరణించిన మూడేళ్ళ తరువాత కూడా ఆయనపైన, శ్రీ జగన్మోహన్‌రెడ్డిపైనా చంద్రబాబు ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రకు వస్తున్న ప్రజాభిమానాన్ని చూసి ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌పైన కొత్తగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాసేపు తన బైబిల్‌ అంటారని, తన మతం అంటూ రకరకాలుగా తమపై విమర్శలు చేయడాన్ని శ్రీమతి విజయమ్మ ఖండించారు.

సహకార ఎన్నికలను ప్రహసనంలా మార్చిన ప్రభుత్వం : 
తన తనయుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి త్వరలో బయటకు వస్తారని శ్రీమతి విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళుతున్నామని శ్రీమతి విజయమ్మ చెప్పారు. సహకార ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రహసనంలా మార్చివేసిందని నిప్పులు చెరిగారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఏమి మాట్లాడాలో కూడా తెలియదా? అని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, ఆయన ముఠాపై క్రిమినల్‌, పరువునష్టం దావాలు వేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ కాదని, ఎన్నికల పార్టీ అని చెప్పుకుందని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. రాజన్న రాజ్యం కావాలని రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలూ కోరుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో వారంతా అదే భావాన్ని వ్యక్తం చేశారన్నారు.

తాజా వీడియోలు

Back to Top