మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లే 2014లో ఓటమి

వైయస్‌ఆర్‌ జిల్లా: 2014 ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పల్ప తేడాతో అధికారానికి దూరమయ్యామని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా సమన్వయకర్త వైయస్‌ వివేకానందరెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో నిర్వహించిన కడప నియోజకవర్గ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మూడేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి ఆకాశాన్ని అంటుతుందని ధ్వజమెత్తారు. జిల్లాలో వర్షాభావం వల్ల తాగునీరు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల కష్టసుఖాలు తెలిసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పలు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. వాటిని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం నీచమైన చర్యగా అభివర్ణించారు.  ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. విభజన హామీలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వంవిఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమస్యలకు పరిష్కారం కావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్, సురేష్, మాధవరెడ్డి, రాజేంద్రనాథ్‌రెడ్డి, నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top