బతుకమ్మ ఆట పాటలతో షర్మిలకు వీడ్కోలు

కొడిచర్ల (పాలమూరు జిల్లా) : దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పట్ల, ఆయన తనయ శ్రీమతి షర్మిల పట్ల పాలమూరు జిల్లా మహిళలు తమకు ఉన్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు. శ్రీమతి షర్మిల  మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తమ జిల్లాలో ముగిసిన సందర్భంగా మంగళవారంనాడు జిల్లా సరిహద్దుల్లో బతుకమ్మలను తీసుకువచ్చి, ఆట పాటలతో రంగారెడ్డి జిల్లాలోకి ఆప్యాయంగా సాగనంపారు. మహబూబ్‌నగర్ జిల్లా‌తో తెలంగాణలోకి అడుగిడిన శ్రీమతి షర్మిలను పాలమూరు ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సొంత ఆడబిడ్డలా ఆదరించారు. జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర జరిగిన 20 రోజులు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. మంగళవారంనాడు జిల్లాలో ఆమె పాదయాత్ర పూర్తవడంతో సాదరంగా వీడ్కోలు పలికారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తమ జిల్లాకు చేసిన మేళ్ళు తమ జీవితాల్లో మంచి మార్పును తీసుకువచ్చిన వైనాన్ని మహిళల మాటల్లో వ్యక్తమైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామంతో యాత్ర పూర్తి చేసుకుని శ్రీమతి షర్మిల మంగళవారం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించారు. పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, బాలమణెమ్మ, కందుల శోభనాదేవి తదితరులు తంగేడి పూలతో బతుకమ్మలు కూర్చి శ్రీమతి షర్మిల విశ్రాంతి తీసుకున్న వేదిక వద్ద ఆడి, పాడారు. శ్రీమతి షర్మిలతో పాటు బతుకమ్మలను కూడా రంగారెడ్డి జిల్లా కోళ్లపడకల్ గ్రామం వరకు తీసుకెళ్లి‌, ఆ జిల్లా మహిళలకు అప్పగించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.

మంగళవారం సాయంత్రం 4.38 గంటలకు శ్రీమతి షర్మిల కోళ్లపడకల్‌లోకి ప్రవేశించి రంగారెడ్డి జిల్లాలో యాత్ర ప్రారంభించారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు దేప భాస్క‌ర్‌రెడ్డి, సురేఖ దంపతులు శ్రీమతి షర్మిలకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. అక్కడి నుంచి దాదాపు 8 కిలో మీటర్ల మేర జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది.

రంగారెడ్డి జిల్లా మన్సాన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన బస వద్దకు శ్రీమతి షర్మిల రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 16.50 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు మొత్తం 772.80 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో 20 రోజుల పాటు 94 గ్రామాల మీదుగా 290.70 కి‌లోమీటర్ల మేర షర్మిల నడిచారు. మంగళవారం షర్మిల యాత్రలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వై‌యస్ విజయమ్మ, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు కేకే మహేంద‌ర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజ్‌ఠాకూర్, బాజిరెడ్డి గోవర్ధ‌న్,‌ బి. జన‌క్ ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బెక్కరి జనార్దన్‌రెడ్డి, గట్టు రామచంద్రరావు, సంకినేని వెంకటేశ్వరరావు, గౌరు వెంకటరెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, ఆదం విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Back to Top