'సమైక్య శంఖారావా'నికి భారీగా తరలిరండి

ఏలూరు :

సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు పార్టీలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. పెద్దలకు కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభ నిర్వహించనున్నట్టు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతోనే శ్రీ జగన్ సమైక్య శంఖారా‌వం పూరిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్ర ఒక్కటే ఈ సభ లక్ష్యమని, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఎన్జీవోలు, ఇతర జేఏసీల సభ్యులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

సమైక్య శంఖారావం సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని బాలరాజు తెలిపారు. నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో రెండు రైళ్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో బస్సులతో పాటు ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమైక్య శంఖారావానికి ప్రజలు, సమైక్యవాదులు తరలివచ్చేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బాలరాజు పిలుపునిచ్చారు.

Back to Top