రూటు మార్చిన కాంగ్రెస్, చంద్రబాబు: బాజిరెడ్డి

నిజామాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ‌అన్నారు. నిజామాబాద్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో బాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో పార్టీ శ్రేణుల్లో చోటుచేసుకున్న అపోహలను ఆయన దూరం చేశారు. రానున్న రోజుల్లో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం బాజిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చిన కాంగ్రెస్ మరోవైపు సీమాంధ్రలో ధర్నాలు, రాస్తారోకోలు చేయిస్తోందని విమర్శించారు. చంద్రబాబు కూడా తెలంగాణ ప్రకటన వచ్చిన వెంటనే యూట‌ర్ను తీసుకున్నారని ఆరోపించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూనే.. సీమాంధ్రలోని తన పార్టీ నేతలను ఉసిగొల్పుతున్నారని చంద్రబాబుపై బాజిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తున్న ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Back to Top