బాబు మూడేళ్ల పాలన శూన్యమే

  • అవినీతి, అరాచకం, దోపిడీ, దౌర్జన్యాలను పెంచిపోషించారు
  • మూడేళ్లలో పలానా మంచి చేశామని చెప్పగలిగే దమ్ముందా...
  • చట్టాలను, వ్యవస్థలను సర్వనాశనం చేసిన చంద్రబాబు
  • నీ పరిపాలనపై నమ్మకం ఉంటే ఫిరాయింపుదారులను ఉప ఎన్నికలకు పంపు
  • 12 ఏళ్ల పరిపాలనలో మిమ్మల్ని గుర్తు చేసే పథకం ఏదైనా ఉందా..?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
విజయవాడ: మూడేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు ముందు వరుసలో నడిచి లేఖ ద్వారా విభజనకు మద్దతు పలికిన చంద్రబాబు నవనిర్మాణదీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.  చంద్రబాబు మూడేళ్ల ప్రజావ్యతిరేక పాలనపై పార్థసారధి విజయవాడ వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీడీపీ సర్కార్‌ మూడేళ్ల పరిపాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే రోజు పెట్టిన 5 సంతకాలను ప్రజలంతా వెన్నుపోటు సంతకాలుగా భావిస్తున్నారని విమర్శించారు.  నవ నిర్మాణ దీక్షల్లో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పరిపాలన రాష్ట్రానికి అందిస్తాం.. ఎవరం స్వార్ధం కోసం పనిచేయం.. చట్టాలను, వ్యవస్థలను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్‌ చేశారు. 

బాబు పాలనలో భయానక వాతావరణం
చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో వ్యవస్థలను, చట్టాలను సర్వనాశనం చేశారని, ఉన్నతాధికారులపై టీడీపీ కార్యకర్తచే దాడులు, దౌర్జన్యాలు చేయించి రాష్ట్రంలో ఒక  భయానక వాతవారణం సృష్టించారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం చర్యలు తీసుకోకుండా తన కార్యాలయాల్లో రాజీలతో వ్యవస్థలను నాశనం చేశాడన్నారు. రాష్ట్ర ప్రజల నుంచి ఏ విధంగా భూములు లాక్కుందాం.. అభివృద్ధి పేరుతో విలువైన భూములను ఏ విధంగా దౌర్జన్యాలు, రికార్టులు తారుమారు చేసి వంశం చేసుకుందామనే ఆలోచన తప్ప ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.  అధికార అహంతో రాష్ట్ర వనరులను, ప్రజలను విచ్చల విడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

ఒక్క కేసు కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడతావా..?
చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేకపోయినా అనుభవం ఉందన్న ఒక్క కారణంతో ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే.. ఒక్క కేసుకు భయపడి రాష్ట్ర భవిష్యత్తును కేంద్రానికి తాకట్టుపెట్టాడని పార్థసారధి ఆరోపించారు. ఓట్లుకు కోట్ల కేసు కోసం ప్రత్యేక హోదాను, పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను తాకట్టుపెట్టి భయపడి విజయవాడకు పారిపోయి వచ్చాడని దయ్యబట్టారు. ఎన్నికల ముందు 600 హామీల అబద్ధపు గ్రంధాన్ని ప్రచురించుకొని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని ఫైరయ్యారు. డ్వాక్రా మహిళా సంఘాలు, రైతులు, నిరుద్యోగులు ఇలా ఏ ఒక్కరినీ చంద్రబాబు వదిలిపెట్టకుండా మోసం చేశాడన్నారు. రైతులకు బ్యాంక్‌ల్లో అప్పులు కూడా దొరక్కుండా చేసిన నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. అంతే కాకుండా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని రైతులను వంచించాడని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రజాధనంతో విదేశాల్లో విహార యాత్రలతో కాలం గడిపాడని మండిపడ్డారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు పలానా చేశాను అని ధైర్యంగా చెప్పగలవా చంద్రబాబు అని నిలదీశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన అనగానే ఫీజురియంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు గుర్తుకు వస్తాయి. ఇలా నీ గత 9 ఏళ్ల పాలనను కలుపుకొని 12 సంవత్సరాల్లో బాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం పార్టీగా ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా ప్రశ్నాపత్రం ద్వారా వందల ప్రశ్నలు అడిగాం.. దాంట్లో మీ పాలనపై కనీసం 10 మార్కులు అయినా వేసుకోగలిగే దమ్ముందా అని చురకంటించారు. మీ మిత్రపక్షమైన బీజేపీ నేతలే లీవ్‌ టీడీపీ–సేవ్‌ బీజేపీ అని నినాదాలు చేస్తుందంటే ఇంతకంటే అవమానం మరొకటి ఉండదన్నారు. రాష్ట్రాన్ని టీడీపీ నుంచి సేవ్‌ చేసేది ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని స్పష్టం చేశారు. ప్రజలంతా మాకే ఓటేస్తారన్న దమ్ము మీకుంటే ప్రలోభాలతో లాక్కున్న 21 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలకు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. నీ పరిపాలనపై అంత నమ్మకం ఉంటే నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా దొడ్డిదారిన ఎందుకు నీ పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నావని నిలదీశారు. చంద్రబాబు మూడేళ్లుగా అవినీతి, అక్రమాలను పెంపిపోషించారు కానీ ప్రజలకు చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. 

తాజా వీడియోలు

Back to Top