బాబు రంగులు మార్చే నైజం అన్ని పక్షాలకు తెలుసు

రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటు సభ్యులుగా ప్రతి ఒక్కరిని కలుస్తామనీ, ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు ఉండవని రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన నీడను తానే నమ్మరని, ఆయన నైజాన్ని దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు స్ఫష్టంగా అర్దం చేసుకున్నాయన్నారు. ఈ రోజు కేసుల గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బురద చల్లడంతోపాటు, న్యాయ స్థానాలకు ఆపాదించడం చట్ట విరుద్దమన్నారు. ఆయన సభ బయట ఇటువంటి మాటలు మాట్లాడి ఉంటే తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చేదన్నారు. ఈ రోజు కేసులనేవి ప్రభుత్వ పరిధిలోనో, విచారణ సంస్థల పరిధిలోనో లేవని , అవి న్యాయస్థానాల పరిథిలో ఉన్నాయన్న విషయాన్ని మరచి చంద్రబాబు నాయుడు మాట్లాడటం విచారకరమన్నారు. తన స్వార్ధం కోసం ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి, రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టారన్నారు. 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాజ్యసభలో నాటి ప్రధాన మంత్రి చేసిన ప్రకటన, దరిమిలా కేంద్ర మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచాలంటూ , వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో నాలుగేళ్లుగా  అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ప్రాణవాయువు, సంజీవిని అని కేంద్రంపై అన్ని విధాలుగా వత్తిడి తెస్తుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం కేంద్రంతో లాలూచి పడి, హోదాను కాదంటూ, ప్యాకేజికి ఒప్పకున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి తత్వాన్ని , దేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు స్పష్టంగా అర్ధమైందని, ఏ పార్టీతోనూ 5 ఏళ్లకు మించి పొత్తును కొనసాగించని ఆయన నైజం అందరికీ తెలుసన్నారు. 
ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి అన్ని పక్షాలు మద్ధతు పలకడం వెనక, వైయస్ఆర్ సీపీ అలుపెరగని పోరాటంతోపాటు, రాష్ట్ర ప్రజల న్యాయమైన డిమాండ్ ప్రధాన కారణమన్నారు. అంతే కానీ ఇందుకోసం చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదన్నారు. 

Back to Top