చంద్రబాబు మానసిక పరిస్థితి సక్రమంగా ఉందా?

 తిరుపతి సభలో బిజెపితో పొత్తు పొట్టుకోబోమని ఎందుకు
చెప్పలేదు 

ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారు

పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సూటి ప్రశ్న

హైదరాబాద్ :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మానసిక పరిస్థితిని ఒకసారి విశ్లేషించాల్సి ఉందని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తనపై కేసులు, విచారణ జరుగుతుందన్న భయంతో,
అటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకే తిరుపతిలో సభను
నిర్వహించినట్లుగా కనిపిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో తామేదో
చేశామంటూ చెప్పుకోడానికి చంద్రబాబు తెగ ఆరాట పడుతున్నారని విమర్శించారు.
సెప్టెంబరు
2016 తరువాత ప్రత్యేక ప్యాకేజి గొప్ప తనం వివరించమని చెపుతూ పుస్తకాలు పంపిణీ చేయడమే
కాకుండా, టిడిపి శిక్షణ శిబిరాల్లో కూడా  హోదా
వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని వివరించమని చెప్పిన మాటను
మరచిపోయారన్నారు.  చంద్రబాబు నాయుడు
ఉపన్యాసం హోదా మా హక్కు అని నినదించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన
నాటి నుంచి ప్రత్యేక హోదా ఆంధ్రులహక్కు అంటూ నినదించిన వైయస్ ఆర్ కాంగ్రెస్
కార్యకర్తలపై కేసులు పెట్టారని, ఇవాల్టికి కూడా వాటిని ఎదుర్కుంటున్నామన్నారు.
వారిపై పెట్టిన కేసులను ఎందుకు ఎత్తి వేయలేదని ప్రశ్నించారు. ఈ రోజు ప్రత్యేక హోదా
అంటూ నినదిస్తున్న చంద్రబాబు నాయుడు, హోదా కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు
పెట్టి అణచివేయాలని ఎందుకు చూశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు కాకమ్మ
కబుర్లు, అబద్దాలతో ప్రజలను మోసం చేసే యత్నం చేస్తున్నారని, ఇది సరైన విధానం
కాదన్నారు. తిరుపతి సభలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తారని అందరూ అనుకున్నా
కానీ నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదన్నారు. ఇదంతా కూడా ఎక్కడో ఏదో పొరపాటు
జరుగుతున్నట్లుగా భావించాల్సివస్తోందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారుని, తనపై
కేసులు పెడతారని ఆయన అనుకుంటున్నారనే ఆందోళనతోనే తిరుపతిలో సమావేశాన్ని ఏర్పాటు
చేసి  తనపై కేసులు పెట్టవద్దంటూ కేంద్రంపై
వత్తిడి పెంచే యత్నం చేశారన్నారు. ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరి మీద కోపాలు
లేవంటూ రాజీపడే ధోరణిని వ్యక్తం చేస్తున్నారని, భారతీయ జనతా పార్టీతో తాము పొత్తు
పెట్టుకోబోమంటూ చెప్పుకునే ధైర్యం లేదని ఎద్దెవా చేశారు.

 అప్పుడు ఇంగ్లండ్ లో పోరాటం చేయమనే వారు

ఇలాంటి దుర్మార్గమైన వాదనలు వినిపంచే వాదనలు
చేస్తున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు బ్రహ్మాండమైన మాటలు చెప్పారు. బ్రిటిషు వారికి
వ్యతిరేకంగా పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ అని గొప్పగా చెప్పారు. అబ్దుల్ కలాంను
రాష్ట్రపతి, సత్యా  నాదెండ్ల, పివి సింధు తనవల్లే ప్రతిభ కనపరిచారని, 400 సంవత్సరాల హైదరాబాద్ ను నేనే నిర్మించానని, సెల్
ఫోన్ ను నేనే తీసుకుని వచ్చానని, స్వాతంత్య్రం కోసం   పోరాడిన పార్టీగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించారంటే
ఆయన మానసిక పరిస్థితిని ఒకసారి విశ్లేషించుకోవాల్సి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ
గురించి ఆయనకేం తెలీదు,ఎన్ టి ఆర్ పెట్టిన పార్టీని దొంగింలించిన పార్టీ గురించి
ఆయనకు ఏమీ తెలీక, ఇలాంటి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించవద్దన్నారు.

బ్రిటిషు వారితో తాము పోరాడామంటూ చెప్పుకుంటున్న
చంద్రబాబు, ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే రీతిన పోరాడినట్లుగా బావించాల్సి
ఉందన్నారు. నిజంగా చంద్రబాబు ఆరోజు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఉంటే, గాంధీజి
కూడా మనం ఇక్కడ ఇండియాలో కాదు పోరాటం చేయాల్సింది, ఇంగ్లండ్ లో పోరాటం చెయ్యాలంటూ
సూచించేవారని (ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో కాదు, ఢిల్లీలో నిరనసనలు చేయాలంటూ
బాబు చేసిన వ్యాఖ్యలనుద్దేశించి)  వ్యంగ్యాస్త్రాలు
సంధించారు.

ఇదీ మీ టెక్నాలజీ....

ఆరు బయట పడిన వర్షం కంటే భవనాల్లోనే ఎక్కువ వర్షం
కురిసే టెక్నాలజీ చంద్రబాబు సొంతమని అంబటి విమర్శించారు.  టెక్నాలజీ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, బయట 3 సెం.మీ.ల
వర్షం పడితే, ప్రతిపక నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఛాంబర్ లో అంతకు
రెట్టింపుగా 6 సెం. మీ. వర్షం పడిందని, ఇంత మంచి సింగపూర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారంటూ
విమర్శించారు. ఇది చాల బాధాకరం.

నాలుగేళ్లపాటు ప్రజలను మోసం చేశారు. అనేక
దోపిడీలకు అక్రమాలకు పాల్పడ్డారని, ప్రాయశ్చిత్తానికి మించిన మరో పరిష్కారం లేనందున,
ఇన్నాళ్లూమోసం చేశానని ఇకపైమోసం చేయనని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పక పోతే ప్రత్యేకహోదాపై
మాట్లాడే నైతిక  అర్హత  టిడిపికి లేదన్నారు. . టిడిపి ఎంపిలు కూడా
వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తేనే వారి చిత్తశుద్దిని
చాటుకున్నట్లవుతుందన్నారు. 


తాజా వీడియోలు

Back to Top