బాబు జీవితం అక్రమాలకు అడ్డా

 • చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది అక్రమ దందాలు
 • సేవ్‌ రివర్స్‌ అంటూ అందుకు రివర్స్‌గా సీఎం తీరు
 • 2018కల్లా పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ, చింతలపుడి, పురుషోత్తపట్నం ఎందుకు
 • ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం
 • ప్రతిపక్షం విఫలమైందని బాబు చెప్పడం విడ్డూరం
 • రుణమాఫీకి అడ్డుపడ్డామా..? ఉద్యోగాలిస్తుంటే వద్దన్నామా..?
 • విఫలమైంది ప్రభుత్వమా.. ప్రతిపక్షమా చంద్రబాబూ
 • వైయస్‌ జగన్‌ పోరాటాలకు భయపడి బురదజల్లే ప్రయత్నం
 • రాజధాని నిర్మాణం అంటే విటలాచార్య సినిమా సెట్టింగ్‌ అనుకుంటున్నావా..?
 • సినిమా గ్రాఫిక్స్‌ చేసేవారితో క్యాపిటల్‌ నిర్మాణం చేయిస్తారా.. 
 • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌
విజయవాడ: చంద్రబాబు చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది అక్రమ దందాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ మండిపడ్డారు. నదులను రక్షించాలని సేవ్‌ రివర్స్‌ అనే కార్యక్రమం చేపట్టి దానికి రివర్స్‌గా చంద్రబాబు కృష్ణానదిలో అక్రమ నిర్మాణంలో నివాసం ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉండే ఇంటిని అక్రమ నిర్మానమని హైకోర్టు మొట్టికాయలు వేసి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖామంత్రి బాధ్యతలు చేపట్టిన దేవినేని ఉమా పెద్ద పుడిగింలా కృష్ణానదిలో బోటు వేసుకొని విహారయాత్ర చేసి నది పరిసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడరని గుర్తు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అక్రమ నివాసంలో ఉంటున్నాడని తెలిశాక, దేవినేని మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగ్గీ వాసుదేవరావు బాబా నదులను పరిరక్షిస్తానని సేవ్‌ రివర్స్‌ కార్యక్రమం చేపడితే ఆయన పక్కన చేరి ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. చంద్రబాబు నదులను ఆక్రమించుకుంటున్నాడని మండిపడ్డారు. 

టీడీపీలో చేరడం, మామను వెన్నుపోటు పొడవడం..
చంద్రబాబు జీవితమే ఒక అక్రమాల పుట్ట అని జోగి రమేష్‌ విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో చేరడం అక్రమం, టీడీపీలో చేరి అందరినీ తొక్కుకుంటూ ఎదగడం అక్రమం, ఆ తరువాత పార్టీ వ్యవస్థాపకులు, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం, రాళ్లతో, చెప్పులతో కొట్టడం అక్రమం అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ను పైకి పంపించేంత వరకు చంద్రబాబు మానసిక క్షోభపెట్టారని ఆరోపించారు. మళ్లీ ఆయన ఆయన విగ్రహాన్ని, ఫోటోలను అక్రమాలకు ఉపయోగించుకుంటున్నాడన్నారు.

పోలవరానికి వెళ్లి గోల్లు గిల్లుకుంటున్నావా.. బాబూ
ముఖ్యమంత్రి మాటలను రాష్ట్ర ప్రజలంతా గమనించాలని జోగి రమేష్‌ సూచించారు. ప్రతి జీఓ వెనుక అక్రమాలేనని, పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపుడి ప్రాజెక్టుల పేరుతో ప్రజల ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నాడని మండిపడ్డారు. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని చెప్పి మళ్లీ ఇన్ని ప్రాజెక్టులు చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. పట్టిసీమ పేరుతో రూ.18 వందల కోట్లు, చింతలపుడికి రూ. 36 వందల కోట్లు, పురుషోత్తపట్నంకు రూ.4 వేల కోట్లు వెచ్చించడం ఎందకని నిలదీశారు. ట్రాన్స్‌రాయ్‌ కంపెనీ పనిచేయడం లేదని మూడున్నర సంవత్సరాలు తరువాత చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి సోమవారం పోలవరానికి వెళ్లే నువ్వు అక్కడికెళ్లి గోల్లు గిల్లుకుంటున్నావా అని విరుచుకుపడ్డారు. కమీషన్ల కోసం ఒత్తాసు పలుకుతావా అని నిలదీశారు. 

వైయస్‌ జగన్‌కు భయపడే అబద్ధాలు..
నంద్యాలకు వెళ్లిన చంద్రబాబు ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలను వెలుగెత్తి చాటినందుకు విఫలమయ్యామా అని చురకంటించారు. విఫలమైంది.. ప్రభుత్వమా.. ప్రతిపక్షమా అని నిలదీశారు. రుణమాఫీ చేస్తానంటే అడ్డుపడ్డామా..? ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నమా..? నిరుద్యోగ భృతి ఇస్తానంటే అడ్డుకున్నామా..? ఏం చేశామని అడ్డుపడుతున్నారని చెబుతున్నావని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నిలదీస్తుంటే దానికి భయపడి ప్రతిపక్షంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబును రోడ్డు మీద నిలబెడతాం..
టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ఎండగట్టి చంద్రబాబును రోడ్డు మీద నిలబెడతామని జోగి రమేష్‌ అన్నారు. రాజధాని నిర్మాణాలు సింగపూర్, జపాన్, చైనా, షాంగై, చైనా, మలేసియా తరహాలో నిర్మిస్తానని బీరాలు పలికిన చంద్రబాబు సినిమాడైరెక్టర్‌ రాజమౌళిని డిజైన్‌ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంతకు ముందు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాజమౌళిని అడిగితే అందుకు ఆయన నిరాకరించారని గుర్తు చేశారు. అయినా సిగ్గులేకుండా ఆయన్ను తీసుకొచ్చి రాజధాని నిర్మాణం డిజైన్‌ల కోసం తీసుకొచ్చారన్నారు. సినిమా సెట్టింగ్‌లు వేసుకునే వారితో రాజధాని నిర్మాణం చేపట్టడం మంచిపద్దతి కాదన్నారు. రాజధాని నిర్మాణం అంటే చిన్న పిల్లలకు సినిమాలు చూపించడమా..? విటలాచార్య సినిమా సెట్టింగ్‌ అనుకుంటున్నావా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబును పిచ్చి ఆస్పత్రిలో చేర్చాలా అని నిలదీశారు. 

తాజా ఫోటోలు

Back to Top